Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా

కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా

Gaddamidi Naveen
8 డిసెంబర్, 2025

తెలంగాణలో కాంగ్రెస్ రెండేళ్లుగా అమలుకాని హామీలతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, తెలంగాణ బీజేపీ ఎత్తిన మహాధర్నాలో పార్టీ ప్రముఖులు విస్తృతంగా పాల్గొన్నారు.ప్రజలు, కార్యకర్తలు,వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు మహాధర్నాకు భారీ సంఖ్యలో తరలి రావడంతో ఇందిరాపార్క్ ప్రాంతం రాజకీయ వేడిమిని సంతరించుకుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ ప్రముఖ నేతలు, ముఖ్యంగా రాష్ట్రంలోని ముఖ్య నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల పాలనను తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలలో ఏదీ అమలు చేయనందున, రేవంత్ రెడ్డి సర్కారు పాలన ప్రజలను విసిగించుతోందని వారు పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ప్రజలకు కనువిందు చేస్తూ చెప్పిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం కానయ్యాయని. వంచన, తప్పుదారి పట్టింపు, ప్రచార అర్భాటాలకే పరిమితమైన పాలన కొనసాగుతోందని ఆయ‌న‌ విమర్శలు గుప్పించారు.అలాగే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్ముతూ ఆర్థిక వ్యవస్థను నడిపినట్లే, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారూ అదే దారిలో నడుస్తోందని, భూములు అమ్మకుండా పూట గడవని పరిస్థితి ఏర్పడిందని ఆయ‌న‌ ఆరోపించారు. ప్రజల మీద భారం పెరుగుతుండగా, అభివృద్ధి పేరుతో ఆర్థిక కృంగుదలకు దారితీసే నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం త్వరలోనే ప్రజాక్షేత్రంలో నిలబడలేనని వారు అని ఆయ‌న‌ పేర్కొన్నారు. ఇంకా, అమలుకాని హామీల కోసం ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీసే సమయం ఆసన్నమైందని, ప్రజా ఉద్యమాలతో ఈ ప్రభుత్వాన్ని మెలకువ పరచాల్సిన అవసరం ఉందని ఆయ‌న‌ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ గ్యారెంటీలు పూర్తిగా విఫలం. డా. కే. లక్ష్మణ్ విమర్శ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ అమలు కాలేదని, ఎన్నికల హామీలు పూర్తిగా వంచనకే పరిమితమయ్యాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కే. లక్ష్మణ్ తీవ్రమైన విమర్శలు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి గ్యారెంటీ కూడా అమలులో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఆకర్షణీయ హామీలతో ఓట్లు తీసుకున్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా నిరాశపర్చుతోందని తెలిపారు.ఆరు గ్యారెంటీల్లో ఒక్కటీ అమలు కానక్కర్లేదు. హామీల్లో ఒక్కటీ నెరవేర్చనవసరం లేదు… ఇదే కాంగ్రెస్‌ పార్టీ స్టైల్‌ గ్యారెంటీ అని డా. లక్ష్మణ్ ఎద్దేవా చేశారు.

ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టింది కాంగ్రెస్.ఎంపీ డీకే అరుణ

తెలంగాణకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలన్నీ కేవలం మోసపూరిత వాగ్ధానాలుగానే మిగిలిపోయాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నట్టేట ముంచిందని మహబూబ్ నగర్ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. ప్రజలను అవమానించే విధంగా పాలన కొనసాగుతుండగా, విజయోత్సవాలు చేసుకునే అర్హత లేకపోయినా సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలు చుట్టూ తిరుగుతూ మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ‘అభివృద్ధి చూసి ఓటు వేయండి’ అని చెప్పడం పై స్పందించిన ఆమె, అవును… అభివృద్ధి చూసి ఓటు వేయాలి. కానీ ఆ అభివృద్ధికి నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే అనే విషయం ప్రజలు మరవకూడదు అని ఆమె పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు వంచనకు గురికాకుండా, అభివృద్ధిని సాకారం చేసే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు పోరాటం ఎన్. రాంచందర్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం ప్రజావ్యతిరేక పాలన కొనసాగించడం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్క్‌లో నిర్వహించిన బీజేపీ మహాధర్నా కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, “కాంగ్రెస్‌ను గద్దె దించే వరకు పోరాటం కొనసాగుతుంద”ని స్పష్టం చేశారు.

భూముల అమ్మకం, హామీల వైఫల్యం

రాష్ట్రంలో భూవ్యవస్థపనపై ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఫార్మాసిటీ పేరిట రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, ప్రజల ప్రతిఘటనతో ఆ యత్నం విఫలమైందని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూముల విక్రయాలు, ప్రైవేట్ వారికి ఇండస్ట్రియల్ భూముల కేటాయింపుల వంటి చర్యలను కొనసాగిస్తూ, ఇప్పుడు ఆ భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తున్నారని ఆయన అన్నారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ చెల్లింపులు, ఉద్యోగుల జీతాలు, పదవీవిరమణ లబ్ధులు, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేకపోతుందన్నారు.

మత రాజకీయాలు, భద్రతా వైఫల్యంపై ఆరోపణలు

కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిందని, సీఎం అండ్ బ్రదర్స్ మోడల్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. సామాన్యులకు ఏ ప్రయోజనం కలగలేదని, తెలంగాణ రైజింగ్ కాదు– "తెలంగాణ సింకింగ్" జరుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మతపరమైన వ్యాఖ్యలు, దేవాలయ భూముల రక్షణలో నిర్లక్ష్యం, గోసేవకులపై దాడులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, విద్య, లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యానికి గురయ్యాయని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

బీజేపీకి అవకాశం ఇవ్వండి

తెలంగాణలో అర్బన్ నక్సలిజానికి ఆశ్రయం లభిస్తోందని, బీజేపీ అధికారంలోకి వస్తే వారిని నిర్మూలిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు జాతీయ రహదారుల విస్తరణ,ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు, ట్రైబల్ యూనివర్సిటీ, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ వంటి అనేక ప్రాజెక్టులను ఆయన వివరించారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కూడా ప్రజల చేత తిరస్కరణకు గురవుతుందన్నారు. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులపై జరుగుతున్న బెదిరింపులు, హౌస్ అరెస్టులు కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనమని అన్నారు.బిజెపి కష్టపడి పనిచేస్తోంది. ఇది టీమ్ వర్క్. త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

ఈ మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, పార్లమెంట్ సభ్యులు డా. కే. లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజి రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హామీల వైఫల్యంపై ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహా ధర్నా - Tholi Paluku