
కాంగ్రెస్ హామీలు ఉత్తవే.. ప్రభుత్వ జీవోలతో నిరుద్యోగులకు అన్యాయం: కవిత
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ ఇచ్చిన 'ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల' హామీ ఏమైందని ప్రశ్నించారు.
ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, వివాదాస్పద జీవోల ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కకుండా అడ్డంకులు సృష్టిస్తోందని ఆమె తెలిపారు. ఎన్నికల సమయంలో తెలంగాణ యువతకు అండగా ఉంటామని చెప్పిన రాహుల్ గాంధీ, ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కవిత విమర్శించారు. కొత్త నోటిఫికేషన్లు రావాల్సిన ప్రతిసారీ ప్రభుత్వం ఏదో ఒక జీవో తీసుకువచ్చి అడ్డంకులు సృష్టిస్తోంది. దీనివల్ల డిగ్రీ లెక్చరర్లు, డీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాహుల్ గాంధీ.. మీరు కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా, ఇప్పుడు కూడా తెలంగాణకు వచ్చి ఇక్కడి విద్యార్థులు, యువత దుస్థితిని స్వయంగా చూడాలి అని ఆమె డిమాండ్ చేశారు.
డీఎస్సీకి జీవో 104, గ్రూప్స్‌కు జీవో 29, పోలీస్ ఉద్యోగాలకు జీవో 46, గురుకులాలకు జీవో 81లు నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయని ఆమె పేర్కొన్నారు. ఈ జీవోలను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు నిరుద్యోగుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.7 వేల కోట్లు ఇవ్వడానికి మనసు రాని ప్రభుత్వానికి, మూసీ ప్రాజెక్టుకు మాత్రం రూ. వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. అంగన్‌వాడీలకు జీతాలు లేవని, బాలింతలకు కిట్లు అందడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్ కార్డుల ఏరివేతపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. ఐటీ రిటర్న్స్, చిన్న ప్రైవేటు ఉద్యోగాల సాకుతో 10 నుంచి 15 లక్షల కార్డులను తొలగించే పైశాచిక ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.
