
కాంగ్రెస్ హామీలకు చట్టబద్ధత: అసెంబ్లీలో 'ప్రైవేట్ మెంబర్ బిల్లు' తీసుకురానున్న బీఆర్ఎస్!
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ హామీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో 'ప్రైవేట్ మెంబర్ బిల్లు'ను ప్రవేశపెట్టనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని కేటీఆర్ విమర్శించారు.అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ప్రకటించారని, కానీ ఆ మాట నిలబెట్టుకోలేదని ఆయన గుర్తు చేశారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు రైతులకు అందిన ప్రయోజనాలను చట్టబద్ధంగా అమలు చేసేలా ఈ బిల్లు ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ హామీల ప్రస్తావన
రాహుల్ గాంధీ వంటి సీనియర్ నేతలు స్వయంగా ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా కాంగ్రెస్ పార్టీ డొల్లతనాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో మేము ప్రవేశపెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలపాలని ఆయన సవాల్ విసిరారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ చర్యల వల్ల ఇళ్లు కోల్పోయిన బాధితుల తరపున బీఆర్ఎస్ తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే మేము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్రంలో జరుగుతున్న లక్షల కోట్ల రూపాయల అవినీతికి వ్యతిరేకం అని కేటీఆర్ పేర్కొన్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో వ్యాల్యూ చేయడం నిజం కాదని, అసలు జీరో వ్యాల్యూ ఉన్నవాడు రేవంత్ రెడ్డి మాత్రమే అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలకు కూడా విలువ లేదని, ఆయన ఏం చేస్తున్నారు, తీసుకున్న నిర్ణయాలు కూడా ఆయనకే తెలియని పరిస్థితి ఉన్నదని కేటీఆర్ అన్నారు.
డే ఎకానమీని నాశనం చేసినవాడు నైట్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఆయన పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని పేర్కొన్నారు. రాహుల్ బంధు పథకాన్ని పక్కన పెట్టి రైతు బంధు కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన సూచించారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది అంటే, చేస్తానని చెప్పాను, దానికి నేను ఇంకా కట్టుబడి ఉన్నాను అని ఆయన చెప్పారు. ఫ్లైఓవర్లు, ఇళ్లు, ఇతర ప్రాజెక్టులకు రంగులు వేసి మావి అని కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
