
కాంగ్రెస్ హయాంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది: మోడీ
బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని, గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన బలహీనమైన విధానాలను విడనాడి, 2014 నుంచి వ్యవసాయ రంగం అభివృద్ధిలో దూసుకుపోయేలా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని భారత ప్రధాని నరేంద్రమోడీ వివరించారు. శనివారం న్యూఢిల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ రైతుల ప్రయోజనార్థం రెండు వ్యవసాయ పథకాలను ప్రారంభించారు. ప్రజాస్వామ్య విప్లవంలో గ్రామీణ భారతానికి స్పూర్తినిచ్చిన మహనీయులైన జయప్రకాశ్ నారాయణ, నానాజీ దేశ్ ముఖ్ ల జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి ధాన్ ధన్య కృషి యోజన, పల్స్(పప్పులు) ఆత్మనిర్భరతా మిషన్ లను ప్రారంభించారు. ఈ పథకాల కింద మొత్తం రూ. 35,440 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ పథకాలు భారతదేశంలో లక్షలాది మంది రైతుల పరిస్థితులను మారుస్తాయని, దేశ ఆత్మనిర్భరత, రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టామని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో వ్యవసాయరంగం చాలా ప్రధానమైంది. ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కానీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంపై సరైన దృష్టి సారించలేదని విమర్శించారు. నిర్లక్ష ధోరణి చూపిందని ఆరోపించారు. వ్యవసాయాన్ని పట్టించుకోలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ శాఖల మధ్య సమన్వయం లేకుండా వ్యవహరించిందన్నారు. తద్వారా వ్యవసాయ వ్యవస్థ క్షీణించుకుపోయిందని ఆయన విమర్శించారు..
2014 నుంచి పెరిగిన పంటల ఉత్పత్తులు
పంటల నుంచి మార్కెటింగ్ వరకు అనేక నూతన విధానాలు తీసుకొచ్చి రైతులకు ప్రయోజనం కలిగించామన్నారు. 11 సంవత్సరాల్లో, ధాన్య ఉత్పత్తి 90 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగిందని, పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో 64 మిలియన్ టన్నుల పెరుగుదల సాధించిందన్నారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉందని, అలాగే చేపల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నామని ఈ సందర్భంగా వివరించారు. 2014కి ముందుతో పోలిస్తే, తేనే ఉత్పత్తిలో కూడా గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. అలాగే మూడు రకాల ఉత్పత్తుల్లో – గుడ్లు, పండ్లు, రైతు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు – చెప్పుకొదగ్గ స్థాయిలో ప్రగతి నెలకొల్పమన్నారు. అలాగే దేశంలో 6 ఎరువుల ఫ్యాక్టరీలు నిర్మించామని, 2.5 కోట్ల మంది రైతులకు సాయిల్ కార్డులు అందించామన్నారు. దాదాపు 1 హెక్టార్ల వరకు నీటిపారుదల సౌకర్యాలు విస్తరించామన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రూ.2 లక్షల కోట్లు రైతులు లబ్ధి పొందారని అన్నారు.
పీఎం ధన్ ధాన్య కృషి యోజన
రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 100 జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకానికి ప్రభుత్వం రూ.24 వేల కోట్లు కేటాయించింది. దీని ద్వారా వ్యవసాయంలో ఆధునికీకరణ, యాంత్రీకరణ పెంచడం, పంట నష్టాలను తగ్గించడం, రైతుల పంటల ఉత్పత్తిని పెంచడం, ఒకే పంటపై ఆధారపడకుండా, బహుళ పంటలు సాగు చేసి తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం. భూమి, నీరు, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయం చేయడం. పండిన పంటలను పంచాయితీ, బ్లాక్ స్థాయిల్లోనే నిల్వ చేసుకుని పంట నష్టాలు తగ్గించుకోవడం. రైతులకు మెరుగైన నీటి పారుదల సౌకర్యాలను కల్పించడం. దీర్ఘకాల, తాత్కాలిక రుణాలను సులభంగా రైతులు అందించి, రైతుల పెట్టుబడిని పెంచడం. ఏపీలోని గుంటూరు, కృష్ణా, నెల్లూరు, అనంతపురం, ఈస్ట్ గోదావరి, తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలు ఎంపికయ్యాయి.
పల్స్ (పప్పులు) ఆత్మనిర్భరతా మిషన్
దేశంలో గణనీయంగా పప్పుల ఉత్పత్తి పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. వేరే ఏ దేశాలపై అధారపడకుండా సొంతంగా దేశంలోనే గోధుమలు, కందులు, పెసర్లు, ఉలవలు, శనగలు పండించండ. అందుకుగాను దేశంలోని ప్రతి హెక్టార్లో ఉత్పత్తిని పెంచి, మెరుగైన నిల్వ సౌకర్యాలను కల్పించడం, తద్వారా పప్పుల సాగును పెంచడం. ఇందులో భాగంగా పప్పు పంటలకు మద్దతు కల్పిస్తారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ. 11,440 కోట్లు కేటాయించింది.
