
కాంగ్రెస్ హయాంలో అస్సాం అక్రమ చొరబాటుదారుల నిలయం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అస్సాంను అక్రమ చొరబాటుదారుల అడ్డాగా మార్చిందని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. శనివారం అస్సాం మాజీ బీజేపీ అధ్యక్షుడు భబేష్ కలిత ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ అనుసరించిన "ఇన్‌ఫిల్ట్రేషన్ మోడల్" (అక్రమ చొరబాటు విధానం) రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టిందని ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో అస్సాంలోని ‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అడవి, భూమి)లను చొరబాటుదారులకు ధారాదత్తం చేశారని మంత్రి మండిపడ్డారు. లక్షలాది ఎకరాల భూమి అక్రమ ఆక్రమణలకు గురైందని ఎవరు పడితే వారు వచ్చి సెటిల్ అయ్యేలా రాష్ట్రాన్ని ఒక ‘ధర్మసత్రంగా మార్చారని విమర్శించారు. ఈ భూమి కేవలం ఇక్కడి స్థానిక ప్రజలకు మాత్రమే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులు ఇప్పించి ఓటరు జాబితాల్లో పేర్లు చేర్పించడం ద్వారా కాంగ్రెస్ రాజకీయ లబ్ధి పొందిందని దుయ్యబట్టారు.
1962 భారత్-చైనా యుద్ధ సమయంలో అస్సాం ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని చౌహాన్ గుర్తు చేశారు. అదేవిధంగా 1979లో విదేశీ చొరబాటుదారులకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించినప్పుడు నాటి ప్రభుత్వం వారిపై అణచివేత చర్యలకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ కృషి వల్లే అస్సాం భౌగోళికంగా ఇతర దేశాల్లో కలవకుండా నిలిచిందని, అటువంటి మహనీయుడిని కూడా కాంగ్రెస్ గౌరవించలేదని విమర్శించారు. గోపీనాథ్ బోర్డోలోయ్, భూపేన్ హజారికా వంటి దిగ్గజాలకు కాంగ్రెస్ భారతరత్న ఇవ్వలేదని కానీ ప్రధాని నరేంద్ర మోదీ వారికి అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించి అసలు సిసలైన గౌరవాన్ని చాటారని పేర్కొన్నారు.
గతంలో మహిళా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్‌కు భిన్నంగా బీజేపీ ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తోందని మంత్రి తెలిపారు. అస్సాంలోని 'ఒరునోదీ' పథకం, మధ్యప్రదేశ్‌లోని ‘లాడ్లీ’ పథకం వంటివి మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే, స్వయం సహాయక బృందాల్లోని ‘లాఖపతి బైడియోల’ (లక్షాధికారిణిలు) సంఖ్యను 3 కోట్ల నుంచి 6 కోట్లకు పెంచుతామని హామీ ఇచ్చారు. పేదలకు పక్కా ఇళ్లు, టీ గార్డెన్ కార్మికులకు భూమి హక్కులు కల్పించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, గత ఐదేళ్లలో అస్సాం ప్రభుత్వం 1.65 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిందని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు.
