
కాంగ్రెస్ హయాంలో అస్సాంలో భారీ అవినీతి: అమిత్‌షా
అస్సాంలో కాంగ్రెస్ పాలన కొనసాగిన 15 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆరోగ్య బడ్జెట్ నుంచి ప్రతి సంవత్సరం సుమారు రూ.150 కోట్లు దోచుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆరోపించారు. ఆదివారం అస్సాంలో రూ.2,092 కోట్ల విలువైన ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు.
పది సంవత్సరాల క్రితం అస్సాం ఆరోగ్య వ్యవస్థ దయనీయంగా ఉండేది. కాంగ్రెస్ నేతలు ప్రజల ఆరోగ్యం కంటే తమ కుటుంబాల ఆర్థిక ప్రయోజనాలపైనే దృష్టి పెట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరోగ్య రంగంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ప్రతి ఏడాది రూ.150 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. కానీ ఆ డబ్బును అసలు లేని 9 లక్షల పిల్లల చికిత్సకు, నిర్మించని 390 అంగన్‌వాడీ కేంద్రాలకు ఖర్చు చేసినట్లు చూపించారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత అస్సాం వైద్య సదుపాయాలు గుజరాత్,మహరాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల స్థాయికి చేరాయని షా తెలిపారు.
గత పది సంవత్సరాల్లో రాష్ట్రం వైద్య సేవలు, వైద్య విద్య రంగాల్లో స్వయం సమృద్ధి సాధించిందని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రోటాన్ థెరపీ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం అస్సామేనని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 92 శాతం జనాభాకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు వైద్య బీమా అందుబాటులో ఉందని తెలిపారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయినప్పుడు పెద్ద పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల ద్వారా సహాయం చేస్తున్నాయని చెప్పారు.
మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు తగ్గడం వంటి సూచికల్లో కూడా అస్సాం పురోగతి సాధించిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై కూడా షా విమర్శలు చేశారు. దేశాన్ని విమర్శిస్తూ విదేశాల్లో మాట్లాడటం సరైంది కాదని అన్నారు. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నిర్వహించిన ‘షర్ట్‌లెస్’ నిరసనపై కూడా ఆయన విమర్శలు చేశారు. పార్లమెంట్ మెట్లపై కూర్చొని టీ-పకోడీలు తినడం తగదని, పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి పవిత్ర స్థలమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గువాహటిలో రూ.675 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రజ్యోతిష్పూర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అలాగే గోలాఘాట్, తిన్సూకియాలో క్యాన్సర్ కేంద్రాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక ఢిపూ, జోర్హాట్, బర్‌పేట మెడికల్ కాలేజీలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేశారు. కాగా అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం అస్సాంకు చేరుకున్నారు. గత నాలుగు నెలల్లో ఆయన రాష్ట్రానికి రావడం ఇది నాలుగోసారి.
