Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ సీనియర్ నేత మోహ్సినా కిద్వాయి కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత మోహ్సినా కిద్వాయి కన్నుమూత

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి మోహ్సినా కిద్వాయి బుధవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. వయోభార సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఉదయం నోయిడాలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె అంత్యక్రియలు సాయంత్రం ఢిల్లీలోని నిజాముద్దీన్ సమాధి స్థలంలో నిర్వహించనున్నారు.

ఆమె మృతిపై ప్రముఖ కాంగ్రెస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ, దేశానికి ఆరు దశాబ్దాలకు పైగా సేవలందించిన గొప్ప నాయకురాలిని దేశం కోల్పోయిందన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్నో సంవత్సరాలు సభ్యురాలిగా సేవలందించిన ఆమె పార్టీ కష్టకాలాల్లో మార్గనిర్దేశం చేసిన నాయకురాలని పేర్కొన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కూడా ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన సీనియర్ నాయకురాలిగా ఆమె నిలిచారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా మహిళలకు ఆమె ప్రేరణగా నిలిచారని చెప్పారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రింయాకగాంధీ వాద్రా మాట్లాడుతూ, కిద్వాయి జ్ఞానం, మార్గనిర్దేశం పార్టీకి ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పనిచేసిన కొద్దిమంది మహిళా నేతల్లో ఆమె ఒకరని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌‌ కూడా ఆమెను ‘కాంగ్రెస్ పార్టీకి మహత్తర నాయకురాలు’గా అభివర్ణించారు. రాజకీయాల్లో శాంత స్వభావం, అనుభవం, విలువలకు ప్రతీకగా నిలిచారని అన్నారు.

రాజకీయ ప్రస్థానం

1960లో కేవలం 28 ఏళ్ల వయస్సులోనే ఆమె ఉత్తరప్రదేశ్ శాసన మండలికి ఎన్నికై రాజకీయాల్లో ప్రవేశించారు. తరువాత 1974లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు.

1978లో ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్ లోక్‌సభ ఉపఎన్నికలో గెలవడం ఆమె జాతీయ రాజకీయాల్లో ఎదుగుదలకు మార్గం సుగమం చేసింది. అనంతరం మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో ఆమె కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వంలో కార్మిక, ఆరోగ్య–కుటుంబ సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, రవాణా, పట్టణాభివృద్ధి వంటి శాఖలను ఆమె నిర్వహించారు. ఆమె జీవితంలో ప్రత్యేకత ఏమిటంటే – నాలుగు వేర్వేరు శాసన సంస్థల్లో సభ్యురాలిగా పనిచేశారు. శాసన మండలి సభ్యురాలు (ఎమ్మెల్సీ), ఎమ్మెల్యే, లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీగా సేవలందించారు.

చివరి వరకు చురుకైన రాజకీయ జీవితం

2004లో ఆమె రాజ్యసభకు ఎన్నికై అనేక సంవత్సరాలు ఎగువసభలో కొనసాగారు. 2022లో జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో కూడా శశిథరూర్‌‌ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ప్రముఖ నేతల్లో ఆమె ఒకరు. అదే సంవత్సరం ఆమె తన ఆత్మకథ ‘మై లైఫ్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌’ను విడుదల చేశారు. అందులో తన రాజకీయ జీవితంలోని అనుభవాలను వివరించారు.