Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ సర్కార్ ఆరు వైఫల్యాలు: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

కాంగ్రెస్ సర్కార్ ఆరు వైఫల్యాలు: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ

Gaddamidi Naveen
13 మార్చి, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వం వైఫల్యం చెందిన ఆరు ప్రధాన అంశాలను ఆయన ఎండగట్టారు.

రైతులకు తీరని అన్యాయం

ఎన్నికల హామీ మేరకు రూ.15 వేల 'రైతు భరోసా' అమలు చేయకుండా రైతులను ప్రభుత్వం వంచించిందని విమర్శించారు. పెట్టుబడి సాయం అందక, సాగునీరు లేక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా కుంగిపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

నిరుద్యోగ యువత, ఉపాధ్యాయుల గోస

ఎన్నికల్లో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు విద్యాకమిషన్ పేరుతో జీతాలు తగ్గిస్తామంటూ ఉపాధ్యాయులను భయాందోళనకు గురిచేస్తున్నారని ఆయ‌న విమర్శించారు.

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు

రాష్ట్ర సేవలో తరించిన విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని, దశాబ్దాల పాటు రాష్ట్రానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించకపోవడం అన్యాయమని అన్నారు. దాదాపు రూ.12 వేల కోట్లకు పైగా రిటైర్మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పెన్షన్ల అమలులో వైఫల్యం

వృద్ధాప్య పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచుతామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కనీసం ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లను కూడా సమయానికి అందజేయడం లేదని గుర్తుచేశారు.

కుప్పకూలిన వైద్య ఆరోగ్య వ్యవస్థ

అలాగే వైద్య ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ దవాఖానల్లో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జడ్చర్ల ఆసుపత్రి మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటన ఆరోగ్య వ్యవస్థ దుస్థితిని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు.

మున్సిపల్ శాఖ

మున్సిపల్ శాఖ పనితీరుపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో పారిశుద్ధ్య పరిస్థితి దారుణంగా మారిందని చెప్పారు. సీఎం పరిధిలోనే ఉన్న మున్సిపల్ శాఖ విఫలమవ్వడం వల్ల వీధి కుక్కలు, కోతుల దాడులు పెరిగాయని, పారిశుద్ధ్యం క్షీణించి అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని, అందుకే తెలంగాణ ప్రజల పక్షాన బీజేపీ ఈ పోరాటం చేస్తోందని రామచందర్ రావు స్పష్టం చేశారు. పాలకులు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించాలని, తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.