
కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే అసత్య ఆరోపణలు: బీజేపీ నేత ఎన్వీ సుభాష్
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆయన కుటుంబంపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలను తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ పవన్ ఖేరాపై ఘాటు విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు, రాహుల్ గాంధీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే పవన్ ఖేరా ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఎన్వీ సుభాష్ మండిపడ్డారు. రాజకీయాలతో గానీ, వ్యాపారాలతో గానీ సంబంధం లేని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను వివాదాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు. కేవలం ఓట్ల కోసమే అస్సాం ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కల్పించేందుకు ఖేరా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మీ ఆరోపణల్లో నిజం ఉంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఎందుకు పారిపోయారు? అని సుభాష్ ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టు కేవలం ఒక వారం రోజుల పాటు తాత్కాలిక ట్రాన్సిట్ బెయిల్ మాత్రమే మంజూరు చేసిందని, నిందితుడు అస్సాం వెళ్లి అక్కడి కోర్టులో తన వాదనలు వినిపించుకోవాలని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి భార్య రినికి భుయాన్ శర్మపై ఖేరా చేసిన పాస్‌పోర్ట్, దుబాయ్ ఆస్తుల ఆరోపణలను శర్మ కుటుంబం పూర్తిగా తోసిపుచ్చింది. ఆ ఆధారాలు పాకిస్థానీ సోషల్ మీడియా గ్రూపులు సృష్టించిన ఏఐ ఫ్యాబ్రికేషన్స్ అని, అవి పూర్తిగా నకిలీవని బీజేపీ స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ హెచ్చరిక
ముందస్తుగా అస్సాం సీఎం స్పందిస్తూ.. ఆరోపణలు చేసే ముందు విదేశీ వ్యవహారాల మంత్రిని సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. అస్సాం పోలీసులు పాతాళంలో ఉన్నా నిందితులను వెతికి పట్టుకొస్తారు. ఈ కుట్ర వెనుక రాహుల్ గాంధీ హస్తం ఉందని నేను అనుమానిస్తున్నాను. అందుకే ఈ కేసు విచారణ రాహుల్ గాంధీ వరకు వెళ్తుంది. మమ్మల్ని భయపెట్టాలని చూడకండి అని సీఎం హెచ్చరించారు. ప్రస్తుతం అస్సాం కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య ఈ వివాదం ముదిరి రాజకీయ యుద్ధానికి దారితీసింది. తెలంగాణ హైకోర్టు బెయిల్ గడువు ముగిసిన తర్వాత అస్సాం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
