
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది: కవిత
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ పార్టీ "పూర్తిగా విఫలమైందని" ఆమె ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయానికి ప్రతిపక్షాల చేతకానితనమే కారణమని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై కవిత మాట్లాడుతూ.. ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోవడం వల్లే మళ్ళీ కాంగ్రెస్‌కు ఓటు వేశారని పేర్కొన్నారు. పట్టణాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీఆర్ఎస్ కనీసం ప్రశ్నించడం లేదు. ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఒక్కటి కూడా అమలు చేయలేదు. అయినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అని ఆమె ఆరోపించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిచిన పార్టీ ఇప్పుడు 16 స్థానాలకు పరిమితమైందని అన్నారు. ప్రజల ప్రేమ ఎందుకు కోల్పోయారో బీఆర్ఎస్ సమీక్షించుకోవాలని ఆమె సూచించారు. కొత్తగూడెంలో సీపీఐకి మద్దతు ఇవ్వడం, కాళేశ్వరం అంశంపై ఆరోపణలు చేసిన వారికే మద్దతు ఇవ్వడం ద్వారా మాజీ సీఎం కేసీఆర్ పై చేసిన ఆరోపణలను అంగీకరించినట్టేనా అని కవిత ప్రశ్నించారు.
భవిష్యత్తులో రాజకీయ పార్టీగా వస్తామని తాము ముందే ప్రకటించామని, అయితే కేడర్ కోరిక మేరకు చివరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేశామని ఆమె వెల్లడించారు. తొలి ప్రయత్నంలోనే ప్రజలు తమను ఆశీర్వదించారని, ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతో పాటు మరో చోట వైస్ చైర్మన్ పదవిని దక్కించుకోబోతున్నామని కవిత తెలిపారు. మరో 40 స్థానాల్లో స్వల్ప తేడాతో విజయావకాశాలు కోల్పోయామని పేర్కొన్నారు. పారదర్శకమైన, అహంకారం లేని, అందరినీ కలుపుకుపోయే రాజకీయాల కోసం ప్రజలు తమను నిరంతరం ఆదరించాలని కవిత కోరారు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పైసా నిధులు ఇవ్వలేదని కవిత విమర్శించారు. కరీంనగర్ మినహా మరే ఇతర కార్పొరేషన్‌లోనూ బీజేపీ మేయర్ పీఠం దక్కించుకునే స్థితిలో లేదని ఎద్దేవా చేశారు. ఇదే క్రమంలో భవిష్యత్తులో బీఆర్ఎస్, బీజేపీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన అజెండాతో ప్రజల్లోకి వచ్చే తమలాంటి నాయకులను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
