Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ రెండేళ్ల 'ప్రజా పాలన' పూర్తి

కాంగ్రెస్ రెండేళ్ల 'ప్రజా పాలన' పూర్తి

Gaddamidi Naveen
9 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. గత శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, డిసెంబర్ 7, 2023 నాడు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.ఆ రోజు కాంగ్రెస్ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ముందు పార్టీకి విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వవర్గాలు అధికార బాధ్యతలు చేపట్టాయి. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్‌లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో జరిగింది. డిసెంబర్ 7, 2023 గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఈ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.

అదే రోజు రేవంత్ రెడ్డి తో సహా ముందే ఎంపికైన మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రారంభ మంత్రివర్గం మొత్తం 11 మంది కేబినెట్ కలిసి ప్రమాణస్వీకారం చేశారు. ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించింది.

ఎల్.బి. స్టేడియం వేదికగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించారు. ప్రమాణ స్వీకారానికి ముందే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాణ స్వీకారం 'ప్రజా ప్రభుత్వం' ఏర్పాటుకు నాంది పలికింది. నాటి నుంచి నేటి వరకు ఈ ప్రభుత్వం 'ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలు' నినాదంతో ముందుకు సాగుతోంది.

ప్రజల భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి లక్ష్యాలుగా ముందుకు సాగుతోంది. గత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి నాయకత్వంలో, తెలంగాణ రాష్ట్రం మరింత వేగంగా, ఉజ్వలంగా వెలిగేలా అభివృద్ధి పథంలో పయనిస్తుందని ప్రభుత్వం ఈ సందర్భంగా పేర్కొంది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతిని సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలియజేసింది.

ప్రజలతో ప్రారంభమైన తమ పాలన ప్రయాణం, ప్రజలకే అంకితమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్ల 'ప్రజా పాలన' పూర్తి చేసుకున్న సందర్భంగా, 'ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు' తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో సాధించిన ప్రగతిని, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించింది. గత పాలనలో కుంగిపోయిన తెలంగాణను తిరిగి నిలబెట్టాలనే సంకల్పంతో ఈ రెండు సంవత్సరాల్లో ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

మహిళలకు ఉచిత బస్ ప్రయాణం.. రోజువారీ భారానికి ఉపశమనం

రాష్ట్ర మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా పనిచేసే మహిళలు, విద్యార్థినులు, గ్రామీణ ప్రాంతాల మహిళలు భారీగా ప్రయోజనం పొందుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రయాణ సౌకర్యం పెరగడంతో మహిళలలో భద్రతా భావన పెరిగిందని పేర్కొన్నారు.

500కు ఎల్‌పీజీ

పేద కుటుంబాల ఖర్చులను తగ్గించే దిశగా ప్రభుత్వం రూ.500కు గ్యాస్ సిలిండర్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పెరిగిన జీవనవిహార వ్యయాల మధ్య ఈ నిర్ణయం వేలాది కుటుంబాలకు ఉపశమనాన్ని కలిగించిందని నివేదికలో పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి రుణమాఫీ, పెట్టుబడి సాయం

రెండేళ్ల ప్రజాపాలనలో రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

• 21 వేల కోట్లతో రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ

• ఎకరాకు ఏడాదికి రూ.12,000 రైతు భరోసా

• మద్దతు ధరల చెల్లింపుల్లో పారదర్శకత

• పంట నష్టం పరిహారం, పంపుసెట్లకు ఉచిత విద్యుత్

ఈ చర్యలు రైతాంగంలో నమ్మకాన్ని పెంచినట్లు వ్యవసాయ శాఖ విశ్లేషణ పేర్కొంది.

సొంతింటి కల నిజం, ఇందిరమ్మ ఇళ్ల పథకం

పేదలకు గృహ భద్రత కల్పించేందుకుగాను ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పునరుద్ధరించి, అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. పలు జిల్లాల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతమవుతున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

రాజీవ్ ఆరోగ్య భీమాతో పది లక్షల వరకు భద్రత

ఆరోగ్య రంగం బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్యభీమా అందించే రాజీవ్ ఆరోగ్య భీమా పునరుద్ధరించబడిందన్నారు. అదనంగా కొత్త ఆసుపత్రులు, అత్యాధునిక వైద్య పరికరాలు, సిబ్బందిని నియమించడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవల నాణ్యత పెరిగినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

సామాజిక భద్రత – పెన్షన్ల పంపిణీ

చేయూత పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, విడాకులు పొందిన మహిళలు, వివిధ వర్గాల వారికి పెన్షన్లు అందించబడుతున్నాయి. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తూ కుటుంబాలపై ఖర్చు భారాన్ని తగ్గిస్తోందని ఆయన తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు

ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపన ద్వారా విద్యార్థులు, క్రీడాకారులకు అత్యున్నత శిక్షణ అవకాశాల కల్పనకు మార్గం సుగమమైంది. యూపీఎస్సీ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన అన్నారు.

69 వేల పోస్టులు భర్తీ

రెండేళ్లలో మొత్తం 69,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం రాష్ట్రంలో యువతలో ఆశావాదాన్ని పెంచిందన్నారు. ప్రైవేట్ రంగంలో స్థానిక యువతకు అవకాశాలు పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు అమలులో ఉన్నాయని ఆయన తెలిపారు.

మహిళా సాధికారిత, వడ్డీలేని రుణాలకు భారీ కేటాయింపులు

తెలంగాణలో కోటి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు ఏటా రూ.21 వేల కోట్లు వడ్డీలేని రుణాలు అందిస్తోంది. సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ క్యాంటీన్లు వంటి వ్యాపారాల్లో మహిళలకు శిక్షణతో పాటు రుణ సాయం అందిస్తున్నారు.

ఇన్ఫ్రాస్ట్రక్చర్‌–గ్రీన్ ఎనర్జీ: భవిష్యత్తు లక్ష్యాల వైపు అడుగులు

వేల కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల విస్తరణ, పాఠశాలలు –కార్యాలయాల్లో సౌరశక్తి వినియోగం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 2047 నాటికి తెలంగాణ అభివృద్ధి దిశను నిర్దేశించే విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. “భారత్ ఫ్యూచర్ సిటీ’’ రూపకల్పన ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల వేదికగా మార్చే ప్రణాళికను అమలు చేస్తోంది.

కాంగ్రెస్ రెండేళ్ల 'ప్రజా పాలన' పూర్తి - Tholi Paluku