
'కాంగ్రెస్ ముక్త్ భారత్' నినాదం దేశానికే ప్రమాదం: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ, నెహ్రూ కుటుంబానికి డబ్బు ప్రధానం కాదని, ఆ కుటుంబం దేశం కోసం మూడు తరాల ఆస్తులను, ప్రాణాలను త్యాగం చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా సీఎం, గాంధీ, నెహ్రూ కుటుంబానికి డబ్బు ప్రాధాన్యం కాదని, అవసరమైతే కాంగ్రెస్ కార్యకర్తలే నిధులు సమీకరించి కనీసం రూ.10,000 కోట్ల వరకు సమకూర్చగలరని ఆయన వ్యాఖ్యానించారు.బీజేపీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా వారిని అవమానిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశం కోసం మూడు తరాలుగా త్యాగాలు చేసిన గాంధీ-నెహ్రూ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆయన విమర్శించారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్. దాని వెంటనే అదే స్థాయిలో చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ మాత్రమే. మిగతా పార్టీలన్నీ స్వాతంత్య్రం, రాజ్యాంగం, దేశ బలోపేతం అనే పునాదులపై ఏర్పడ్డవే. ఇప్పుడు అదే కాంగ్రెస్‌ను ‘ముక్త్’ చేయాలని చెప్పడం ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌ను ఆయన “భారత ఆత్మ”గా అభివర్ణించారు. బీజేపీ వంటి పార్టీలు కాంగ్రెస్ వారసత్వాన్ని బలహీనపరచాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గాంధీ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నిస్తూ, దేశం కోసం మూడు తరాలుగా త్యాగాలు చేసిన కుటుంబానికి డబ్బే ముఖ్యమా? అని ప్రశ్నించారు. తెలంగాణలోనే కాంగ్రెస్ కార్యకర్తలు తలచుకుంటే రూ.1,000 కోట్ల వరకు నిధులు సమీకరించగలరని ఆయన పేర్కొన్నారు. గాంధీ,నెహ్రూ కుటుంబం దళితులు, గిరిజనులు, మైనారిటీల స్వరాన్ని ప్రతినిధ్యం వహిస్తోందని, అందుకే వారిని మౌనం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బలంగా తిప్పికొట్టాలని సీఎం పిలుపునిచ్చారు.
స్వాతంత్య్రం సమరాన్ని ప్రస్తావిస్తూ, బ్రిటిష్ పాలకులు మహాత్మా గాంధీపై తీవ్రమైన చర్యలకు దిగలేదని, కానీ స్వాతంత్య్రం అనంతరం బీజేపీ అనుసరిస్తున్న సిద్ధాంతాల వారసత్వం కలిగిన వర్గాలే జాతిపిత ప్రాణాలను బలిగొన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవలను ప్రస్తావిస్తూ, మోతీలాల్ నెహ్రూ వేల కోట్ల ఆస్తులను దేశానికి విరాళంగా ఇచ్చారని, జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్రం పోరాటంలో పదేళ్లపాటు జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశ సేవలో ప్రాణత్యాగం చేశారని చెప్పారు. అలాంటి గొప్ప వారసత్వాన్ని అందుకున్న రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని సీఎం అన్నారు.
పార్టీ అధికారంలో లేని సమయంలోనూ నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు ప్రస్తుతం నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గౌరవించామని ఆయన తెలిపారు. ఎన్నికల ముందు ఏ నాయకుడి మద్దతు తీసుకుంటే కోటాలో టికెట్ వస్తుందనే భావన తప్పని ఆయన అన్నారు. ఇప్పుడేమీ కోటాలు లేవు. కాంగ్రెస్‌లో ఒక్కటే కోటా ఉంది.. అది ప్రతిభా కోటా, అని ఆయన పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షులు తమ పదవుల గౌరవాన్ని కాపాడుకుంటూ, లాబీయింగ్‌లకు దూరంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
