
కాంగ్రెస్ మాఫియా తరహా బెదిరింపుల మక్తల్ బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య: ఎన్. రామచందర్‌రావు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నారాయణపేట జిల్లా, మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థి మృతి రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సంఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేసింది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేసి బెదిరింపులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, మహాదేవ్ మృతి కాంగ్రెస్ అహంకార రాజకీయాలు “మాఫియా తరహా బెదిరింపుల” ఫలితమని విమర్శించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ మంత్రి వాకాటి శ్రీహరి పేరును కూడా ఆయన ప్రస్తావించారు. బాధిత కుటుంబానికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, న్యాయం జరగకపోతే చట్టపరమైన పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
మక్తల్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన పరిస్థితిని సమీక్షించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిందని, రాజ్యసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మహదేవప్ప మృతి వెనుక ప్రధాన కారణం కాంగ్రెస్ నాయకుల నుంచి జరిగిన నిరంతర బెదిరింపులు, వేధింపులేనని రామచందర్‌రావు ఆరోపించారు. ఇది ఒంటరి సంఘటన కాదని, కాంగ్రెస్ తరచూ ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎఫ్ఐఆర్ మార్చారంటూ తీవ్ర ఆరోపణలు
ఇక స్థానిక పోలీసులు నమోదు చేసిన అసలు ఎఫ్ఐఆర్‌ను మార్చి, తారుమారు చేశారన్న వార్తలు వెలువడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది అత్యంత సిగ్గుచేటైన చర్యగా పేర్కొంటూ, పోలీసుల తటస్థత, నిష్పక్షపాతంపై తీవ్రమైన సందేహాలు తలెత్తుతున్నాయని అన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నంగా ఇది కనిపిస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ పలు డిమాండ్లు ఉంచింది. మొదటిగా, అసలు ఎఫ్ఐఆర్‌ను ఎలాంటి మార్పులు లేకుండా పునరుద్ధరించాలని, రెండవదిగా పారదర్శకత కోసం సరైన పోస్టుమార్టం నిర్వహించాలని కోరింది. మూడవదిగా, ఎఫ్ఐఆర్ మార్పులకు బాధ్యులైన స్థానిక పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాలుగవదిగా మహదేవప్పను వేధించిన వారిపై వెంటనే కఠిన చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేసింది.
కుటుంబానికి అండగా బీజేపీ
మహాదేవప్ప కుటుంబానికి తెలంగాణ బీజేపీ తరపున రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బీజేపీ పరివార్ తన కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అరాచక రాజకీయాలకు కాలం దగ్గరపడింది, న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు అని ఆయన హెచ్చరించారు.
నిరంతర వేధింపులే ప్రాణం తీశాయి: ఎన్.వి. సుభాష్
ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన ప్రతినిధి, మీడియా ఇన్‌చార్జ్ ఎన్.వి. సుభాష్ మాట్లాడుతూ, మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్పపై కాంగ్రెస్ నాయకులు నిరంతరం ఒత్తిడి, బెదిరింపులు చేశారని ఆరోపించారు. ఈ కారణంగానే ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఈ విధమైన బెదిరింపులను బీజేపీ సహించబోదని ఆయన అన్నారు. ఇది ఒంటరి సంఘటన కాదని, ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను భయపెట్టే ప్రమాదకర ధోరణి భాగమని పేర్కొన్నారు.
మహాదేవప్ప మృతి విషయంలో రాష్ట్ర పోలీసులపై కూడా బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. బెదిరింపులపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, వారు కాంగ్రెస్ కార్యకర్తలలా వ్యవహరిస్తున్నారని సుభాష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సుభాష్ ప్రశ్నలు లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం ఉంటే ఇలాంటి చర్యలకు ఎందుకు దిగుతోందని ఆయన ప్రశ్నించారు. మక్తల్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి అపూర్వ స్పందన రావడంతో కాంగ్రెస్‌లో భయం పెరిగిందని ఆయన ఆరోపించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ అభ్యర్థి ఎరుకల మహాదేవ్ ప్రచారం చివరి రోజు ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం, నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి స్థానిక రాజకీయ ప్రత్యర్థుల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, ఆ పరిస్థితిని తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎన్నికలకు ఒక్కరోజు ముందు జరిగిన ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఈ సంఘటనను ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన కోసం రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
