Let's talk: editor@tmv.in
కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి:హరీశ్ రావు

కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి:హరీశ్ రావు

Pinjari Chand
19 అక్టోబర్, 2025

బిజెపి కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక, బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపుతున్నది ఎవరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆయా పార్టీలను శనివారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ లో బీజేపీకి 240 మంది ఎంపీలు, కాంగ్రెస్ కి 99 ఎంపీల బలం ఉంది. రిజర్వేషన్ల బిల్లు పెంపును అడ్డుకునేది ఎవరు? రిజర్వేషన్ల పెంపు పై ఢిల్లీలో కొట్లాడాల్సిన రెండు జాతీయ పార్టీలు బీసీలను మభ్యపెడుతూ గల్లీలో డ్రామాలు చేస్తున్నాయి. బీసీలను అవమానిస్తున్నాయన్నారు. ఆరుసార్లు జనాభా లెక్కింపు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు బీసీ గణన చేయలేదు. బిజెపి అయితే ఏకంగా జన గణనను నాలుగేళ్లుగా వాయిదా వేస్తూ వస్తున్నది. గడిచిన 35 ఏళ్ళల్లో ఈ దేశాన్ని కాంగ్రెస్ 15 ఏళ్లు, బిజెపి 17 ఏళ్లు పాలిస్తే ఏనాడు ఈ రెండు పార్టీలకు బీసీలు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు బీసీలపై కపట ప్రేమ నటిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని కేసీఆర్ కోరారు

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఉండాలని 2005 లోనే కోరిన దేశంలోనే ఏకైక నేత కేసీఆర్‌ అని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచాలని రెండుసార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తిచేశారు. అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చలనం రాలేదు. ఇప్పటికీ రిజర్వేషన్లు పెంచలేదు, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. జితని ఆబాదీ, ఉత్నా హక్ అని నినదించే రాహుల్​ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎందుకు పెట్టడం లేదని అడిగారు? కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గాని ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఇప్పుడు ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారు. పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయని వివరించారు. ఏ పార్టీ బిల్లు పెట్టినా దానికి బిఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుంది. ఎలాంటి పోరాటానికైనా బిఆర్ఎస్ కలిసి వస్తుంది. ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు కట్టిపెట్టి.. ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం మొదలు పెట్టాలని కాంగ్రెస్, బిజెపి లను డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి:హరీశ్ రావు - Tholi Paluku