Let's talk: editor@tmv.in
కాంగ్రెస్, బీజేపీల మధ్య తేడా లేదు.. ముస్లింలే లక్ష్యంగా కూల్చివేతలు: అక్బరుద్దీన్

కాంగ్రెస్, బీజేపీల మధ్య తేడా లేదు.. ముస్లింలే లక్ష్యంగా కూల్చివేతలు: అక్బరుద్దీన్

Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో కొనసాగుతున్న కూల్చివేతల పర్వం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీల తీరుపై ఎంఐఎం అసెంబ్లీ పక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు సాగిస్తున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎటువంటి తేడా లేదని ఆయన మండిపడ్డారు.

యోగి అడుగుజాడల్లోనే రేవంత్ రెడ్డి

కూల్చివేతల అంశంపై అక్బరుద్దీన్ స్పందిస్తూ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడ బుల్డోజర్లతో దర్గాలు, మసీదులు, ముస్లింల ఇళ్లను ఎలా కూలుస్తున్నారో, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా అదే డ్రైవ్‌లు, అదే క్రూరత్వాన్ని అనుసరిస్తున్నారు. వీరికి అక్రమ కట్టడాల మీదో, చట్ట ఉల్లంఘనల మీదో కోపం లేదు.. వీరి శత్రుత్వం కేవలం ముస్లింల మీద మాత్రమే అని ఘాటుగా విమర్శించారు. అక్రమ కట్టడాల తొలగింపు పేరుతో కేవలం ముస్లింల ఆస్తులనే ఎంచుకుని మరీ కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు.

మారిన రాజకీయ సమీకరణాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి తోడ్పాటు అందించడంతో పాటు, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంఐఎం కాంగ్రెస్‌కు అండగా నిలిచింది.మద్దతు ఇస్తున్నప్పటికీ తమ సామాజిక వర్గ ప్రయోజనాలకు భంగం కలిగితే సహించబోమని అక్బరుద్దీన్ హెచ్చరించారు. అయితే, తాజా కూల్చివేతల అంశంపై ఎంఐఎం తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా తీవ్రంగా విమర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మూసీ బాధితులకు బీజేపీ భరోసా

మరోవైపు, మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోతున్న బాధితులను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పరామర్శించారు. 'మూసీ గోస - బీజేపీ భరోసా' కార్యక్రమంలో భాగంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులతో ఆయన భేటీ అయ్యారు. ముసి నది తీరాభివృద్ధి ప్రాజెక్ట్ కారణంగా తమ ఇళ్లను కోల్పోయే పరిస్థితి వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నివాసితులు తమ ఇళ్లపై కూల్చివేత ముప్పు ఉందని, కుటుంబాల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది కన్నీరు పెట్టుకుంటూ తమ బాధను వెల్లడించారు. వీరిలో మాజీ సైనికులు కూడా ఉన్నారని పేర్కొంటూ, ఈ పరిస్థితిని రామచందర్ రావు సిగ్గుచేటుగా అభివర్ణించారు. అలాగే, గాంధీ విగ్రహం ఏర్పాటుతో ఈ ఇళ్ల కూల్చివేతకు దారితీసే పరిస్థితి ఏర్పడుతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ముసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ప్రజలను నిర్వాసితులుగా మార్చడం తగదని అన్నారు. మొత్తంగా, కూల్చివేతల అంశం తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తూ, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలకు కారణమవుతోంది.