
కాంగ్రెస్, బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఫిబ్రవరి 11న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నప్పటికీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అయినా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.
2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, సబ్ గ్యారంటీల అమలు గురించి ఇప్పుడు ఎక్కడా ప్రస్తావించడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో అంతర్గత విభేదాలు, ప్రాజెక్టులు కాంట్రాక్టుల విషయంలో ఉన్న వివాదాల నుంచి దృష్టి మళ్లించడమే ముఖ్యమంత్రి ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.
మతపరమైన రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికల సమయంలో ప్రస్తావించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అమలులోకి వచ్చిన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు అభ్యంతరం తెలిపిన విషయాన్ని గుర్తుచేస్తూ, సుప్రీంకోర్టు స్టేను ఆధారంగా కొనసాగించడం ఓటు బ్యాంకు రాజకీయాలేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జిగింపు రాజకీయాలకు పరాకాష్టగా మారింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన దిగజారుడు వ్యాఖ్యలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఎంఐఎం చేతిలో 'స్టీరింగ్'
మున్సిపల్ ఎన్నికల వేళ మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసదుద్దీన్ ఓవైసీ బుల్లెట్ నడిపితే కేసీఆర్ వెనుక కూర్చున్నారు. ఇప్పుడు కేవలం సీట్లు మారాయి కానీ డ్రైవర్ మారలేదు. ఇప్పుడు బుల్లెట్ నడిపేది ఓవైసీయే, అందులో కూర్చున్నది రేవంత్ రెడ్డి. స్టీరింగ్ ఎప్పుడూ ఎంఐఎం చేతిలోనే ఉంటోంది అని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన మతపరమైన రిజర్వేషన్ల గురించి మాట్లాడటం ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో డివిజన్ల విభజన, రిజర్వేషన్ల కేటాయింపులో గందరగోళం సృష్టించి సామాజిక న్యాయాన్ని దెబ్బతీశారని కాంగ్రెస్‌పై ఆరోపించారు.
రాష్ట్రంలో అవినీతి, అక్రమాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా లేదని ఆయన అన్నారు. మున్సిపాలిటీలకు తగిన ఆర్థిక సహకారం అందించడంలో రెండు ప్రభుత్వాలూ విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంపై మాట్లాడుతూ, కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై అనుమానాలు
అలాగే రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. ఆ ల్యాబ్‌లో ముఖ్యంగా ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వంటి కీలక కేసుల డిజిటల్ సాక్ష్యాలు అక్కడ ఉన్నాయా? లేదా? అన్నది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డేటా ఉంటే దానికి బ్యాకప్ ఉందో లేదో స్పష్టం చేయాలన్నారు.
హేట్ స్పీచ్ చట్టం కింద చర్యలు తీసుకోవాలంటే ముందు రేవంత్ రెడ్డిపైనే తీసుకోవాలి. హిందూ దేవుళ్లను అవమానించడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఆయనకే అలవాటు అని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను జైలుకు పంపిస్తానని చెప్పి ఇప్పుడు ఈగ వాలకుండా కాపాడుతున్నారని, కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ అడ్డుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, మాటలతో మభ్యపెట్టే రేవంత్ రెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి హెచ్చరించారు.
