Let's talk: editor@tmv.in
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే నాణేనికి రెండు ముఖాలు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Gaddamidi Naveen
12 మార్చి, 2026

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పిటిషన్లను కొట్టివేయడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి అడుగడుగునా అగౌరవం ఎదురవుతోందని ఆయన విమర్శించారు. ఈ మేరకు బుధవారం తన 'ఎక్స్' వేదికగా వరుస పోస్టులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వంటి నేతలు తర్వాత పార్టీ మార్చుకున్నప్పటికీ వారిపై వచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. ఈ రెండు పార్టీల ఆలోచనా విధానం, వ్యవహార శైలిలో పెద్దగా తేడా లేదని అన్నారు.

బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి, తర్వాత ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని, కాంగ్రెస్ బీ-ఫామ్‌పై ఎంపీగా తనపైనే పోటీ చేసిన ఘటన అందరికీ తెలిసిన విషయమని ఆయన చెప్పారు. సాధారణ ప్రజలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఈ సాక్ష్యాలు స్పీకర్‌కు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను అరికట్టాల్సిన అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అలాంటి చర్యలకు చట్టబద్ధత కల్పించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యవస్థలు అధికార పార్టీల ఒత్తిడికి లోనవుతున్నాయని ఆయన అన్నారు.

వ్యక్తిగత ప్రయోజనాలు, పదవుల కోసం ప్రజల తీర్పును అంగట్లో సరుకులా మార్చడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. అధికార దుర్వినియోగంతో వ్యవస్థలను ప్రభావితం చేయవచ్చేమో కానీ ప్రజల ఆగ్రహాన్ని మాత్రం అడ్డుకోలేరని హెచ్చరించారు. తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, రాజ్యాంగాన్ని అవమానించే వారికి ప్రజా క్షేత్రంలో తగిన తీర్పు తప్పదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు కొట్టివేతపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. బహిరంగంగా జరిగిన పార్టీ ఫిరాయింపులకు సాక్ష్యాలు లేవనడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన మండిపడ్డారు.

ముఖ్యమంత్రి సమక్షంలో కండువా కప్పుకున్న దృశ్యాలు సాక్ష్యాలు కావా?ఫిరాయించిన అభ్యర్థికి కాంగ్రెస్ బి-ఫామ్ ఇచ్చి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించడం నిజం కాదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌లో గెలిచినంత మాత్రాన, ఫిరాయింపుల సాక్ష్యాలు మాయమైపోతాయా? రాష్ట్రమంతా చూస్తుండగా జరిగిన ఈ పరిణామాలు కాగితం మీద ఎలా మాయమవుతాయని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే 'న్యాయం' కాదు, 'అన్యాయం' అని ప్రజలు భావిస్తున్నారని, ఇలాంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని బండి సంజయ్ హెచ్చరించారు.