
కాంగ్రెస్ ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో సుమారు ఒక గంట పాటు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యానికి చిహ్నంగా మారిందని విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి, రియల్ ఎస్టేట్ దందాలకే పరిమితమైన పాలన సాగుతోందని ఆరోపించారు.
ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందానేనా? ఈ కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజా సమస్యలు పట్టవా? అంటూ ప్రశ్నించిన కేసీఆర్, ఇకపై బీఆర్ఎస్ వైఖరి పూర్తిగా మారబోతోందని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఒక లెక్క… ఇక నుంచి ఇంకో లెక్క. రెండేండ్లు ఓపిక పట్టినం… ఇక ఊరుకునేది లేదు అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర వైఫల్యం
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కేసీఆర్ తీవ్రంగా ఎండగట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అన్ని అనుమతులతో డీపీఆర్ సిద్ధం చేసినప్పటికీ, తమ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ డీపీఆర్‌ను వెనక్కి పంపిందని తెలిపారు. అయినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలు, నీటి హక్కులను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నోరు తెరచి మాట్లాడలేదని ఆయన మండిపడ్డారు. మన రాష్ట్రానికి లాభం చేకూర్చే ప్రాజెక్టుపై ఇన్ని కుట్రలు జరుగుతుంటే, మాట్లాడే సోయి కూడా లేని సన్నాసుల్లా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారు అంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని “దద్దమ్మ ప్రభుత్వం”గా కేసీఆర్అభివర్ణించారు.
జల హక్కులపై పోరాటానికి సిద్ధం
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రానికి మొదటికే ముప్పు వచ్చిందన్నారు. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నానని ప్రకటించారు. ఊరూరా ప్రజలను తట్టి లేపుతాం… జల దోపిడీని ఎండగడతాం అంటూ ఉద్యమానికి కేసీఆర్ పిలుపునిచ్చారు.
రైతులు, యూరియా సమస్యపై ఆగ్రహం
కాంగ్రెస్ పాలనలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు యూరియా కోసం రైతులు చెప్పుల లైన్లలో నిలబడేవారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మాయమైందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే దుస్థితి తిరిగి వచ్చిందన్నారు. యూరియా ఇవ్వడానికి యాప్ ఎందుకు? యూరియా పంపిణీ చేయగల కనీస తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఒక్క కొత్త పాలసీ కూడా అమలు చేయలేదని ప్రభుత్వ నైపుణ్యం లేకపోవడమే ఇప్పుడు ప్రభుత్వ విధానం అన్నట్టు విమర్శించారు.
క్రైమ్ పెరిగిందంటూ ఆరోపణలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేసీఆర్ ఆరోపించారు. జంట నగరాల్లో హత్యలు, రాష్ట్రవ్యాప్తంగా మానభంగాలు పెరిగాయని, మొత్తం క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని కేసీఆర్ తెలిపారు. ఎన్నికలకు ముందు ఎన్నో అసాధ్యమైన హామీలు ఇచ్చి, పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకుని, ప్రజల మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బహిరంగ సభలతో ప్రజాక్షేత్రంలోకి
కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందని కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనే కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టేందుకు సమరశంఖం పూరించాం అని కేసీఆర్ ప్రకటించారు.
