Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు భద్రతలేదా?: రామచందర్ రావు

కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు భద్రతలేదా?: రామచందర్ రావు

Gaddamidi Naveen
12 జనవరి, 2026

మల్కాజ్‌గిరిలోని కట్టమైసమ్మ దేవాలయంలో శ‌నివారం రాత్రి జరిగిన అపవిత్ర ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసి దేవాలయ పవిత్రతను దెబ్బతీసిన ఉదంతంపై హిందూ సమాజం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆలయాన్ని సందర్శించిన బీజేపీ నేతలు అక్కడి పరిస్థితిని సమీక్షించి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించి, గర్భాలయ విగ్రహం ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై 26 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.

ఘటన వివరాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన అల్తాఫ్ (26) అనే వ్యక్తి శనివారం రాత్రి కట్టమైసమ్మ ఆలయంలోకి ప్రవేశించాడు. అతను ఆలయ ప్రాంగణంలో మూత్ర విసర్జన చేసి హిందువుల విశ్వాసాలను అవమానించాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు నిందితుడిని నిలదీసి, దెబ్బలు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

నేరేడ్‌మెట్ పోలీసులు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మతపరమైన నమ్మకాలను కించపరచడం అక్రమంగా ఆలయంలోకి ప్రవేశించినందుకు అల్తాఫ్‌ను ఆదివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ వెల్లడించింది. నిందితుడి గత చరిత్రను కూడా విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయంటూ ఆరోపించారు. ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం క్షమించరానిదని, భక్తుల విశ్వాసాలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

తెలంగాణలో పరిస్థితులు బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లతో పోటీ పడేలా ఉన్నాయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులను గౌరవిస్తామని చెప్పినప్పటికీ, మరోవైపు “సర్ తన్ సే జుదా” వంటి నినాదాల భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనలో ఆలయ పవిత్రతను భంగం చేసిన వ్యక్తిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.కట్టమైసమ్మ ఆలయంలో జరిగిన ఘటనను బీజేపీ నేతలు హిందూ సమాజ గౌరవంపై దాడిగా అభివర్ణించారు.

అదేవిధంగా, ఈ అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలతో పాటు “సూడో సెక్యులర్ మీడియా” మౌనం పాటించడంపై కూడా ఆయ‌న‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ భేదాలు పక్కనపెట్టి, ప్రజాస్వామ్య వ్యవస్థలు స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కూడా స్పందించకపోవడం దురదృష్టకరమని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

హిందూ దేవాలయాల గౌరవం, భక్తుల విశ్వాసాల రక్షణ కోసం బీజేపీ ఎప్పుడూ నిలుస్తుందని ఆయ‌న అన్నారు. ఈ ఘటనపై బీజేపీ మూగప్రేక్షకుడిలా ఉండ‌దు, అవసరమైతే వీధుల్లోకి వచ్చి ఉద్యమిస్తామని ఆయ‌న హెచ్చరించారు. హిందూ విశ్వాసాన్ని, దేవాలయాల పవిత్రతను కాపాడేందుకు పార్టీ అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తుందని ఆయ‌న‌ తెలిపారు. హిందువుల గొంతును ఎవరూ నొక్కలేరని, విశ్వాసాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు భద్రతలేదా?: రామచందర్ రావు - Tholi Paluku