
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగం: మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మాజీ మంత్రి టి. హరీష్ రావు విమర్శించారు. శనివారం కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ సాగునీరు, ఎరువుల కొరత, విద్యుత్ సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం సకాలంలో చెరువులు, కుంటలు నింపకపోవడం, కాల్వల్లో పూడిక తీయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. నీరు లేక అప్పులు చేసి మరీ బావుల్లో పూడిక తీస్తున్నామని లచ్చన్న అనే రైతు వివరించారు.
యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని, యాప్స్, ఓటీపీ విధానం వల్ల చదువురాని తమకు ఎరువులు అందడం లేదని రైతులు వాపోయారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోల్లో వచ్చే యూరియా, ఇప్పుడు మాకు అందనంత దూరమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఫోన్ చేస్తే ఎరువులు అందేవని, రైతుబంధు సకాలంలో వచ్చేదని చెప్పారు. ప్రస్తుతం కోతల కాలం వచ్చినా రైతు భరోసా అందడం లేదని ఆరోపించారు. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో పంటలకు నీళ్లు పెట్టడం కష్టమవుతోందని రైతులు వివరించారని హరీష్ రావు పేర్కొన్నారు.
రుణమాఫీపై కూడా రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం చెప్పడంతో మహిళా సంఘాల ద్వారా అప్పులు తీసుకుని చెల్లింపులు చేశారని, కానీ ఇప్పటికీ పూర్తి రుణమాఫీ కాలేదని రామారావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు అని, మరో రైతు లచ్చన్న తన ఐదు ఎకరాల భూమికి నీటి వసతి లేక అప్పులు చేసి పనులు చేస్తున్నామని గ్రామస్తులు హరీష్ రావుకు విన్నవించారు. గోపాలరావుపల్లి గ్రామంలో సుమారు 70 మంది రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు వినతి పత్రం అందించారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని హరీష్ రావును కోరారు.
రైతుల సమస్యలు విన్న తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ,ఎన్నికల ముందు మూడు పంటలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు మూడు విడతల రైతుబంధు ఎగ్గొట్టిన రైతు ద్రోహి రేవంత్ అని దుయ్యబట్టారు.99 రోజుల ప్రణాళిక అనేది ఒక కొత్త డ్రామా అని, పోలీసుల భద్రత లేకుండా గ్రామాల్లోకి వస్తే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గోపాలరావుపల్లి రైతుల సమస్యలను, ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని హామీ ఇచ్చారు.
మహిళలకు ఇస్తానన్న రూ.2500 ఎగ్గొట్టారని, కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని స్థితిలో రాష్ట్రం ఉందని హరీష్ రావు విమర్శించారు. రైతుల కడుపు నింపేది సాగునీరు, ఎరువులే తప్ప ముఖ్యమంత్రి తిట్లు కావని ఆయన హితవు పలికారు.
