
కాంగ్రెస్ పాలనలో పేదల పథకాలు బంద్: మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ జిల్లా కార్యదర్శి దొంతుల సురేష్, కాంగ్రెస్ మైనార్టీ సెల్ సీనియర్ నాయకుడు పాషలు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి హరీశ్ రావు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను నిలబెట్టలేకపోయిందని, ముఖ్యంగా గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలను ఒక్కొక్కటిగా నిలిపివేస్తోందని ఆరోపించారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, బీసీ బంధు, మైనార్టీ బంధు, గొర్రెల పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలను రద్దు చేయడం వల్ల పేదలకు నష్టం కలిగిందన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఆ విషయాన్ని కూడా పక్కన పెట్టారని ఆరోపించారు. కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఇస్తామని చెప్పినా అమలు కాలేదని, ప్రజలను మోసం చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణలో కూడా ప్రభుత్వం విఫలమైందని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం లేదని విమర్శించారు.
అమీన్‌పూర్‌లో పేదల ఇళ్లను నోటీసులు లేకుండా కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ బాధ్యత పేదలకు ఆశ్రయం కల్పించడం కానీ, వారి ఇళ్లు కూల్చడం కాదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సిద్దిపేటకు మంజూరైన ప్రాజెక్టులను కూడా రద్దు చేస్తున్నారని విమర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల మాయమాటలకు లోనుకాకుండా బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు.
