Let's talk: editor@tmv.in
కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా

Gaddamidi Naveen
26 మార్చి, 2026

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌ పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తన అనుచరులతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ఆయన ఈ సందర్భంగా ముగింపు పలికారు. ఏఐసీసీ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపిస్తూ, దాని ప్రతులను రాష్ట్ర పార్టీ నాయకత్వానికి కూడా అందజేశారు.

తన రాజీనామాపై జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, నాకు ఎక్కడా సంతృప్తి కలగలేదు. గత 20 నెలలుగా నేను తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడం వల్లే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట కొనసాగడం కంటే తప్పుకోవడమే మేలని ఆయన స్పష్టం చేశారు.

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతను పునఃపరిశీలించాలని పార్టీ అగ్రనాయకత్వం ప్రయత్నించినప్పటికీ, ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉన్నట్లు సమాచారం. జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా - Tholi Paluku