
కాంగ్రెస్ పాకిస్థాన్ మాటలు మాట్లాడుతోంది: ప్రధాని మోడీ
అస్సాంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం పాకిస్థాన్ స్వరానికే అనుగుణంగా మాట్లాడుతోందని ఆయన ఆరోపించారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక దృష్టితోనే నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. బీజేపీ మాత్రం సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోందన్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, అలాగే 2025లో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా కాంగ్రెస్ పాకిస్థాన్ తరఫున మాట్లాడినట్లు వ్యవహరించిందని మోడీ ఆరోపించారు. ఈ విధమైన ‘పాకిస్థాన్ సంబంధం’ దేశానికి హానికరమని పేర్కొన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్దాల పాటు సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేయలేదని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ పథకాన్ని అమలు చేశామని చెప్పారు. ఇప్పటివరకు మాజీ సైనికుల బ్యాంక్ ఖాతాల్లో రూ.1.24 లక్షల కోట్లను జమ చేశామని తెలిపారు.
కాంగ్రెస్‌ది అబద్దాల దుకాణం
మరో ఎన్నికల సభలో మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్‌లో కుటుంబ ఆధిపత్య రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. భారీ అవినీతి కుంభకోణాల్లో కాంగ్రెస్ ‘మొదటి కుటుంబం’ ప్రమేయం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం, అవినీతిలో పాల్గొనడం తప్ప ఇంకేం చేయదని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన ‘మోహబ్బత్ కీ దుకాన్’ వ్యాఖ్యను ఉద్దేశిస్తూ, కాంగ్రెస్ పార్టీ నిజానికి మిథ్యా కీ దుకాన్ (అబద్ధాల దుకాణం) అని మోడీ విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని అన్నారు. అస్సాంలో కూడా కాంగ్రెస్ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అస్సాంలో శాంతి, స్థిరత్వం బీజేపీ పాలనలోనే ఏర్పడిందని తెలిపారు. గత పదేళ్లలో శాంతి ఒప్పందాలు అమలు చేయడంతో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా సాగుతోందన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే బీజేపీకి మరోసారి అవకాశమివ్వాలని ప్రజలను కోరారు.
గిరిజనులను నిర్లక్ష్యం చేసింది
మహిళల కోసం పార్లమెంట్‌లో 33 శాతం రిజర్వేషన్ అమలు 2029 సాధారణ ఎన్నికల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ అంశంపై అన్ని పార్టీలతో చర్చించేందుకు ఏప్రిల్ 16న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కి పెంచే ప్రతిపాదనపై కూడా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని యోచిస్తోందని చెప్పారు. ఇది మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమని వివరించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులను నిర్లక్ష్యం చేసిందని మోడీ విమర్శించారు. రాష్ట్రంలో అక్రమంగా స్థిరపడిన చొరబాటుదారులను బయటకు పంపిస్తూ, స్థానికులకు భూమి పత్రాలు అందజేస్తున్నామని చెప్పారు. రైతుల కోసం కనీస మద్దతు ధరను పెంచామని, వరి క్వింటాల్‌కు రూ.1,300 నుంచి ప్రస్తుతం రూ.2,370కు పెరిగిందని తెలిపారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. అస్సాం ప్రసిద్ధ ‘జోహా’ బియ్యం ఇప్పుడు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతోందని ప్రధాని చెప్పారు.
