Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ నేతలపై అస్సాం సీఎం రూ.500 కోట్ల పరువు నష్టం దావా

కాంగ్రెస్ నేతలపై అస్సాం సీఎం రూ.500 కోట్ల పరువు నష్టం దావా

Pinjari Chand
11 ఫిబ్రవరి, 2026

అస్సాం ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ అస్సాం సోషల్ మీడియా ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ వీడియోను విడుదల చేయడం, దానిపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో బీజేపీ దాన్ని తొలగించింది. అయితే ఆ వీడియో ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ప్రతిపక్షాలు కేసు నమోదు చేయాలని, అలాగే సుప్రీం కోర్టును అశ్రయించాయి. అయితే సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా తాజాగా తనపై కాంగ్రెస్ నేతలు చేసిన భూకబ్జా ఆరోపణలపై రూ.500 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

తనపై, తన కుటుంబంపై ‘భూకబ్జా’ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం రూ.500 కోట్ల పరువు నష్టం (డిఫమేషన్) కేసు దాఖలు చేశారు. కాంగ్రెస్ నేతలు జితేంద్ర సింగ్, భూపేష్ బఘేల్, గౌరవ్ గగోయ్ ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో తనపై తప్పుడు, దుష్ప్రచారం చేశారని పేర్కొంటూ ఈ కేసు వేశారు. బొంగైగావ్‌లో జరిగిన ఓ అధికారిక కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడిన హిమంత గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ నేతలు నేను, నా కుటుంబం కలిసి 12,000 బీఘాల (సుమారు 3,960 ఎకరాలు) బెనామీ భూమిని ఆక్రమించుకున్నామని చెబుతున్నారు.అందుకే కోర్టును ఆశ్రయించాను. వారు చెప్పిన భూముల జాబితాను కోర్టులోనే సమర్పించాలని అన్నారు. అలా చేయలేకపోతే, వారు నాకు రూ.500 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే విషయంపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సీఎం స్పందించారు. నాపై తప్పుడు, దురుద్దేశపూరిత ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నేతలపై రూ.500 కోట్ల నష్టపరిహారం కోరుతూ పరువు నష్టం కేసు దాఖలు చేశాను అని తెలిపారు.

ఫిబ్రవరి 4న గువాహటిలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గగోయ్, పార్టీ చేసిన అంతర్గత దర్యాప్తులో రాష్ట్రవ్యాప్తంగా సీఎం, ఆయన కుటుంబం దాదాపు 12,000 బీఘాల భూమిని ఆక్రమించుకున్నట్టు తేలిందని ఆరోపించారు.

కేసు పెట్టినా భయం లేదు

ఇదిలా ఉండగా, తనను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వీడియోను బీజేపీ అస్సాం సోషల్ మీడియా ఖాతాలో పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ పోలీసులు వద్ద ఫిర్యాదు చేయడంపై కూడా సీఎం హిమంత మాట్లాడారు. నేను ఇప్పటివరకు ఎలా మాట్లాడానో అలాగే మాట్లాడుతూనే ఉంటాను అని అన్నారు. వారు కేసు పెట్టారు, బాగానే ఉంది. ‘కమ్యూనల్’ అంటే ఏమిటో మీకూ తెలుసు. నేను ఎవరికి వ్యతిరేకమో కూడా తెలుసు అని, అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులపై తన వైఖరిని సూచించారు. నాపై కేసు పెడితే నాకు ఏం జరుగుతుంది? తెలుపు తెలుపే, నలుపు నలుపే. వారు నన్ను భయపెట్టలేరు. సిబానీ బోరా, దిగంత బర్మన్, వారి యజమాని రాహుల్ గాంధీ — ఎవరు కేసు పెట్టినా నాకు భయం లేదంటూ కెమెరాకు బొటనవేలు చూపిస్తూ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిబానీ బోరా, దిగంత బర్మన్ గువాహటిలోని డిస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ అస్సాం అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన వీడియోలో, సీఎం హిమంత తుపాకీతో లక్ష్యాన్ని ఎక్కుపెట్టి కాల్చుతున్నట్లు చూపించారని, అందులో ఒకరు టోపీ ధరించి, మరొకరు గడ్డం ఉన్న వ్యక్తిగా కనిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శనివారం పోస్ట్ చేసిన ఈ వీడియోపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగడంతో, దానిని తొలగించినట్లు తెలిపారు.

ఇంతకు ముందు సోమవారం, ఆ వీడియో గురించి తనకు తెలియదని హిమంత చెప్పగా, గౌరవ్ గగోయ్ మాత్రం సీఎం ముస్లింలపై జెనోసైడ్‌ను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ, పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఏపీసీసీ పోలీసు ఫిర్యాదు

ముస్లింలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) మంగళవారం డిస్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేసింది. బీజేపీ అస్సాం అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా (@BJP4Assam) ద్వారా ఫిబ్రవరి 7న పోస్ట్ చేసిన ఒక వీడియో/కంటెంట్ తీవ్రంగా రెచ్చగొట్టేలా, సామూహిక ఉద్రిక్తతలకు దారితీసేలా ఉందని ఏపీసీసీ నేతలు సిబామణి బోరా, దిగంత బర్మన్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ వీడియోలో సీఎం ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించారని, అందులో ‘ఫారినర్ ఫ్రీ అస్సాం’, ‘నో మెర్సీ’, ‘పాకిస్తాన్‌కి ఎందుకు వెళ్లలేదు?, బంగ్లాదేశీయులను క్షమించేది లేదు’ వంటి వాక్యాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా బెంగాల్ మూలాలున్న ముస్లింలను లక్ష్యంగా చేసుకుని, అవమానకరంగా ‘మియాలు’, ‘బంగ్లాదేశీయులు’ అని పిలిచేలా ఉన్నాయని ఆరోపించారు. ఈ కంటెంట్ రాష్ట్రంలో సామూహిక శాంతిని భంగం చేయవచ్చని, సంబంధిత శిక్షా చట్టాల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ పోలీసులను కోరింది.

ఇదిలా ఉండగా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కూడా అస్సాం సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని అత్యవసర విచారణకు తీసుకోవాలని న్యాయవాది నిజామ్ పాషా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్ ఎన్నికల సమయంలో రాజకీయ అంశాలు తరచూ సుప్రీంకోర్టు వరకు వస్తుంటాయి. దీనిని పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు.

మరోవైపు, ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ముస్లింలపై హింసను ప్రోత్సహించేలా ఉందని ఆరోపిస్తూ, అస్సాం సీఎంపై హైదరాబాద్ సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 7న బీజేపీ అస్సాం ‘ఎక్స్’ ఖాతాలో పెట్టి, తర్వాత తొలగించిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని ఆయన తెలిపారు.