
కాంగ్రెస్ నేతను కాల్చి చంపిన దుండగులు
రాజధాని ఢిల్లీ మరోసారి సంచలన హత్యకు వేదికైంది. బహిరంగ ప్రదేశాల్లో భద్రతపై ప్రజల్లో ఇప్పటికే ఆందోళనలు నెలకొన్న తరుణంలో దక్షిణ దిల్లీ బేగంపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు లఖ్‌పత్‌సింగ్ కటారియా (55) శుక్రవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. పార్క్‌లో ఉదయపు నడక చేస్తున్న సమయంలోనే ఇద్దరు దుండగులు వచ్చి ఆయనపై దాడి చేశారు. ఈ దారుణ ఘటన బేగంపూర్‌లో మాల్వియా నగర్ లో చోటుచేసుకుంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, పార్క్ లో నడుస్తున్న కటారియా వద్దకు వచ్చిన దుండగులు ఆయనతో వాదనకు దిగారు. మాటల తగువు కాస్త ఘర్షణకు దారితీసింది.ఘర్షణ మధ్యలో ఒక దుండగుడు కర్రలాంటి వస్తువుతో కటారియాపై దాడి చేయగా, మరొకరు తుపాకీతో కాల్పులు జరిపాడు.కాల్పుల సమయంలో బుల్లెట్ శబ్దం విని చుట్టూ పక్కల వారు భయంతో అక్కడినుండి పరుగులు తీశారు.
ఈ ఘటనపై ఉదయం 9.53 గంటల సమయంలో మాల్వియా నగర్ పోలీస్ స్టేషన్‌కు కాల్పుల సమాచారం అందడంతో వెంటనే పోలీసు బృందం అక్కడికి చేరి, తీవ్ర గాయాలపాలైన కటారియాను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలపాలైన కటారియా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కటారియా బేగంపూర్‌లోనే నివసిస్తూ కాంగ్రెస్ పార్టీలో రెండు దశాబ్దాలుగా చురుకైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజల కోసం నిరంతరం పోరాడడంలో ఆయనకు విశేష గుర్తింపు లభించింది. రాజకీయాలతో పాటు ఆస్తి, అదేవిధంగా కొన్ని వాయపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భార్య వీర్వతి, కుమారుడు శివం ఆయన కుటుంబ సభ్యులు.
ఇక స్థానికుల సమాచారం ప్రకారం కటారియాకు కొంతకాలంగా స్లమ్ నివాసులతో భూవివాదం కొనసాగుతోందని, అదే హత్యకు కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పోలీసులు దీనిపై అధికారికంగా ఏమీ వెల్లడించలేదు.ఇదే కాక కటారియాకు జాతీయ స్థాయి కాంగ్రెస్ నేతలతో సన్నిహితంగా ఉండేవారు. అజయ్ మాకెన్, సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో ఆయన కలిసి ఉన్న ఫొటోలు గతంలో బయటకు వచ్చాయి. అయినప్పటికీ, ఈ హత్యకు రాజకీయ సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.
ప్రాథమిక దర్యాప్తులో, దుండగులు పార్క్ దగ్గర కటారియా అడ్డగించి దాడి చేసి, మూడు రౌండ్లు కాల్పులు జరిపిన తరువాత మోటార్‌సైకిల్‌పై అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో నుంచి బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు.ఇక పార్క్ లోపల, బయట అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.
