Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయి: సీఎం హిమంత

కాంగ్రెస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయి: సీఎం హిమంత

Pinjari Chand
19 మార్చి, 2026

అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మరింతమంది కాంగ్రెస్ నాయకులను బీజేపీలోకి తీసుకురావడం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బుధవారం నాగావ్ లోక్‌సభ సభ్యుడు ప్రద్యుత్ బోర్డోలోయ్ బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే నవజ్యోతి తాలుక్దార్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు గువాహటిలో బీజేపీలో చేరనున్నారని తెలిపారు. అభ్యర్థుల జాబితాను ఈ సాయంత్రం ఖరారు చేయనున్నామని, మరో రెండు నుంచి మూడు రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని చెప్పారు.

1975 నుంచి కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్న బోర్డోలోయ్ చేరికతో బీజేపీ బలపడుతుందని హిమంత పేర్కొన్నారు. ఆయనను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీ కేంద్ర నాయకత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. ఆత్మగౌరవం ఉన్నవారు కాంగ్రెస్‌లో ఉండాల్సిన అవసరం లేదు. మరింతమంది కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తీసుకురావడం మా లక్ష్యమని వివరించారు. ఇదిలా ఉండగా బీజేపీలో చేరిన బోర్డోలోయ్ కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పక్కన పెట్టారని ఆరోపిస్తూ, టికెట్ అంశం మాత్రమే కాకుండా పలు కారణాల వల్ల పార్టీని వీడినట్లు తెలిపారు. నాకు టికెట్ రావడం జీవన్మరణ సమస్య కాదు. కానీ స్వాభిమానంతో ఉండటం ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ నాకు చాలా ఇచ్చిందని అన్నారు. లోక్‌సభలో నా రెండో టర్మ్ కొనసాగుతోంది. ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నాయి. అవమానాన్ని భరించి కొనసాగవచ్చును. కానీ నేను పార్టీని వీడి పనిచేయాలని నిర్ణయించుకున్నానని బోర్డోలోయ్ స్పష్టం చేశారు. బోర్డోలోయ్ రాజీనామా అనంతరం కాంగ్రెస్ ఆయన కుమారుడిని మార్గెరిటా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించింది.

ఇటీవలే అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా కూడా బీజేపీలో చేరడం గమనార్హం. మూడు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన పార్టీ మార్పు రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా, అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది.

హిందూ-ముస్లిం అంశం లేదు.. బోర్డోలోయ్ వ్యక్తిగత అజెండా: ఇమ్రాన్ మసూద్

అస్సాం రాజకీయాల్లో ఉద్రిక్తతల మధ్య కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్, నాగావ్ ఎంపీగా ఉన్న ప్రద్యుత్ బోర్డోలోయ్ చేసిన ఆరోపణలకు ఘాటుగా ప్రతిస్పందించారు. ఈ వ్యవహారంలో ఎలాంటి హిందూ-ముస్లిం అంశం లేదని, అది పూర్తిగా బోర్డోలోయ్ వ్యక్తిగత అజెండా మాత్రమేనని పేర్కొన్నారు. ఏఎన్‌ఐతో మసూద్ మాట్లాడుతూ నాపై ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదు. ఇది వారి వ్యక్తిగత అజెండా. అస్సాంలో మేము కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నాం. నేను పార్టీకి సరైన నివేదిక ఇచ్చాను. వారి అజెండా విఫలమైందని అన్నారు. అస్సాంలో రాజకీయాలు మతంపై కాకుండా పార్టీ పనితీరుపై నడుస్తాయని చెప్పారు. కాంగ్రెస్‌లో ఎక్కువమంది నేతలు హిందువులే. బోర్డోలోయ్ వెళ్లిపోవడంతో పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది హిందూ-ముస్లిం సమస్య కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదని, కొంత అసంతృప్తి సహజమే అయినప్పటికీ పరిస్థితులను సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు.

మరోవైపు, ఇటీవల బీజేపీలో చేరిన బోర్డోలోయ్ మాత్రం కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ లోపల అవమానాలు, సహకారం లేకపోవడం కారణంగానే తాను బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఒక అస్సాం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశాన్ని ప్రస్తావిస్తూ, తన ఆరోపణలను మసూద్ ‘అసత్యం’గా కొట్టిపారేయడం తనను తీవ్రంగా బాధించిందని బోర్డోలోయ్ చెప్పారు. నాకు ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. నన్ను అవమానించారని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ నాయకత్వం తనను పక్కన పెట్టిందని ఆరోపిస్తూ బోర్డోలోయ్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ అంశం ఒక్కటే కారణం కాదని, పలు సమస్యల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

కాంగ్రెస్ నుంచి మరిన్ని చేరికలు ఉంటాయి: సీఎం హిమంత - Tholi Paluku