Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ నిర్లక్ష్యానికి దేవాదుల ప్రాజెక్టు బలి: హ‌రీష్ రావు

కాంగ్రెస్ నిర్లక్ష్యానికి దేవాదుల ప్రాజెక్టు బలి: హ‌రీష్ రావు

Gaddamidi Naveen
21 ఫిబ్రవరి, 2026

వరంగల్ జిల్లా దేవన్నపేటలోని దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌజ్‌లను మాజీ మంత్రి హ‌రీష్ రావు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాదులలో భాగమైన దేవన్నపేట వద్ద ఉన్న మూడు పంపులను తనిఖీ చేశామని, అయితే మూడుకు మూడు మోటార్లు పని చేయడం లేదని తెలిపారు. గోదావరిలో సమృద్ధిగా నీటి ప్రవాహం ఉన్నప్పటికీ, రైతులకు అవసరమైన నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ వ్యవస్థ ఆగిపోయిందని ఆయ‌న విమర్శించారు. సమ్మక్క సాగర్ వద్ద ఈరోజు కూడా 16 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నప్పటికీ, దేవన్నపేట పంప్ హౌజ్‌లో మోటార్లు ఆఫ్‌లో ఉన్నాయని చెప్పారు.

2025 మార్చి 18న నీటిపారుదల శాఖ మంత్రి, జిల్లా మంత్రి పొంగులేటి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పినా అవి ప్రారంభం కాలేదని, మోటార్లు స్టార్ట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటామని ప్రకటించి వెంటనే హెలికాప్టర్‌లో వెళ్లిపోయారని ఆరోపించారు. గత సంవత్సరం పంపులు ఆన్ చేయకపోవడం వల్ల 60 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని గుర్తుచేశారు. గత పది రోజులుగా మోటార్లు ఆగిపోవడంతో నీటి లిఫ్ట్ పూర్తిగా నిలిచిపోయిందని ఆయ‌న తెలిపారు.

బీఆర్ఎస్ కృషితోనే దేవాదుల రూపకల్పన

పంప్ హౌజ్‌లో రిపేర్ ఉందని, సాఫ్ట్‌వేర్ సమస్యలున్నాయని అధికారులు చెబుతున్నారని, కానీ అసలు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విమర్శించారు. దేవాదుల మూడో దశను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, 99 శాతం పనులు పూర్తి చేశామని ఆయ‌న తెలిపారు. టన్నెల్ నిర్మాణం సహా కీలక పనులను పూర్తిచేసి ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చామని చెప్పారు.

సమ్మక్క బ్యారేజీ నిర్మాణంతో 365 రోజులు నీళ్లు ఎత్తిపోసే విధంగా మాజీ సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని ఆయ‌న పేర్కొన్నారు. ప్రారంభంలో 25 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉండగా, వాటిని 60 టీఎంసీలకు పెంచి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో కేవలం 47 వేల ఎకరాలకే ఆయకట్టు ఉండగా, బీఆర్ఎస్ హయాంలో దాన్ని 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచినట్టు ఆయ‌న చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం 7,300 కోట్లు ఖర్చు చేసి 30 వేల ఎకరాల భూసేకరణ పూర్తిచేసిందని, మిగిలిన 3 వేల ఎకరాలు పూర్తి చేస్తే మరో 2.40 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. అయితే గత రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 200 కోట్లు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

చంద్రబాబుకు 'గురు దక్షిణ'గా నీళ్లు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబు నాయుడుకు గురు దక్షిణగా ఏపీకి జారవిడుస్తున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏపీ జల దోపిడీని అడ్డుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.

బీంఘన్‌పూర్ పంప్ హౌజ్ వద్ద 2,160 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్నప్పటికీ, కేవలం 1,700 క్యూసెక్కులే ఎత్తిపోస్తున్నారని తెలిపారు. తెలంగాణ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, గోదావరి నీటిని సక్రమంగా వినియోగించడంలో నిర్లక్ష్యం చూపుతోందని ఆయ‌న‌ ఆరోపించారు.తక్షణమే దేవాదుల మోటార్లు నడిపి మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున హ‌రీష్ రావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నిర్లక్ష్యానికి దేవాదుల ప్రాజెక్టు బలి: హ‌రీష్ రావు - Tholi Paluku