
కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోంది: కేరళ సీఎం
కేరళలో సీపీఎం–బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న ఆరోపణలను ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మంగళవారం తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ చేసిన ఆరోపణలను ‘ఆధారంలేని, అబద్ధపు’విగా అభివర్ణించారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడిన విజయన్ ఇవి పూర్తిగా నిరాధార ఆరోపణలు. కాంగ్రెస్‌కు ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఉన్న చరిత్ర చాలా కాలంగా ఉంది. ఇలాంటి ‘సౌకర్య కూటములు’ గతంలో ఎన్నోసార్లు జరిగాయని పేర్కొన్నారు. నేమాం నియోజకవర్గంలో బీజేపీ ఖాతా తెరవడానికి కాంగ్రెస్ సహకరించలేదా? కాంగ్రెస్ ఓట్లు లీక్ అయిన విషయం స్పష్టంగా కనిపించింది. త్రిశూర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కనిపించిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి ఎప్పటికీ వామపక్షమేనని, అవకాశవాద రాజకీయాలకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీనేనని ఆయన విమర్శించారు. ఈ ‘డీల్’ ఆరోపణలు కాంగ్రెస్ తన గతాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే అని అన్నారు.
పరస్పరం సహకరించుకుంటున్నాయి
ఇదిలా ఉండగా, సీపీఎం–బీజేపీ మధ్య ‘అనైతిక అవగాహన’ ఉందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ ఆరోపించారు. బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) కొన్ని నియోజకవర్గాల్లో పరస్పర సహకరించుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇది ఆధారంలేని ఆరోపణ కాదు. రెండు పార్టీల అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే, కొన్ని చోట్ల పరస్పర అవగాహన స్పష్టంగా కనిపిస్తుందని వేణుగోపాల్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్రమోడీ పై గట్టిగా మాట్లాడకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని, ఈడీ వంటి కేంద్ర సంస్థల ఒత్తిడి కారణంగా ఆయన మౌనం వహిస్తున్నారని ఆరోపించారు. కేరళలో రాజకీయ ఆధిపత్యం కోల్పోతామనే భయంతో సీపీఎం బీజేపీతో అనైతిక రాజకీయ ఒప్పందానికి దిగిందని విమర్శించారు.
ఈ పరిణామాలు కేరళ అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకోవడం గమనార్హం. 140 స్థానాల అసెంబ్లీకి ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్రంలో ప్రధాన పోటీ వామపక్ష డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) – కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలో, యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) – కాంగ్రెస్ నేతృత్వంలో సాగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూడా పోటీలో ఉంది.
