
కాంగ్రెస్ తెచ్చిన చట్టాలను ఎన్డీయే తుంగలో తొక్కింది: టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డీయే ప్రభుత్వం తుంగలో తొక్కిందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన గాంధీ భవన్‌లో ఆదివారం మాట్లాడుతూ గతంలో 2005 జూన్ 15న యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రజలకు ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత కల్పించడం, అధికారుల జవాబుదారీతనాన్ని పెంపొందించడమని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి. దాని స్వతంత్రతను బలహీన పరిచిందని మండిపడ్డారు. ఆర్టీఐను నీరు గార్చేందుకే కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో 11 మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని చెప్పారు. ఆర్టీఐ తీసుకొచ్చి 20 ఏళ్లయిన సందర్భంగా దాని గొప్పతనం తెలియజేయాలనుకున్నామని పేర్కొన్నారు. దూరదృష్టితో యూపీఏ ప్రభుత్వం సమచారహక్కు చట్టం తీసుకొచ్చిందన్నారు.
ఆర్టీఐ చట్టం ద్వారా లాభాలు
పారదర్శక పాలన ప్రభుత్వ నిర్ణయాలు, టెండర్లు, నియామకాలు, ప్రాజెక్టులు వంటి వివరాలు ప్రజలకు ఈ చట్టం ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
అధికారులపై బాధ్యత
ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వ శాఖలపై ఉంటుంది. ఈ చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో అధికారులు సమాచారాన్ని అందించాలి. అయితే కోరిన సమాచారం ఒక వ్యక్తి జీవితం లేదా స్వేచ్చకు సంబంధించినది అయితే దానిని 48 గంటల్లోగా అందించాలి.
అవినీతి తగ్గింపు
దేశంలో అనేక అవినీతి కేసులు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఉదా: ఆదర్శ్ హౌసింగ్ స్కాం, పీఎమ్ ఫండ్‌లలోని వివరాలు మొదలైనవి.
సాధారణ పౌరుడి శక్తి
గ్రామస్థాయిలో పంచాయతీ ఖర్చులు, రేషన్ దుకాణాల సరఫరాలు వంటి విషయాలు కూడా ప్రజలు తెలుసుకోవచ్చు.
సమాజ సంస్కరణలకు పునాది
ఎన్నో సామాజిక కార్యకర్తలు (ఉదా: అన్నా హజారే, అర్వింద్ కేజ్రీవాల్ మొదలైన వారు) ఈ చట్టం ఆధారంగా ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేశారు.
ఆర్టీఐ చట్టంలో బీజేపీ ప్రభుత్వం చేసిన మార్పులు (2019 సవరణలు)
భారత ప్రభుత్వం 2019లో ఆర్టీఐ సవరణ బిల్లు ను ఆమోదించింది. స్వతంత్రత తగ్గింపు ఆర్టీఐ కమిషనర్ పదవీకాలం, వేతనం మొదలైనవి ముందుగా చట్టంలో స్పష్టంగా ఉండేవి.
కొత్త సవరణలతో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఆధారపడ్డాయి. దీని వల్ల “కమిషనర్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవచ్చని” విమర్శలు వచ్చాయి.
పదవీ కాలం మార్పు
గతంలో 5 సంవత్సరాల స్థిరమైన పదవీకాలం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించేంత కాలం మాత్రమే ఉండేలా చేశారు.
పోస్టులు ఖాళీగా ఉంచడం
అనేక రాష్ట్రాలలో, కేంద్రంలో కూడా ఆర్టీఐ కమిషనర్ పదవులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల దరఖాస్తుల పరిష్కారం ఆలస్యం అవుతోంది. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
