
కాంగ్రెస్ ఏఐ సమ్మిట్‌ను ‘గంది ఔర్ నంగీ’ రాజకీయాలకు వేదికగా మార్చింది: ప్రధాని
ఢిల్లీలో జరిగిన కృత్రిమ మేధ(ఏఐ) గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘షర్ట్‌లెస్’ నిరసనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా విమర్శించారు. అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తన “గంది ఔర్ నంగీ (మురికి, నిర్లజ్జ) రాజకీయాల వేదికగా మార్చిందని ఆరోపించారు. మీరట్‌లో రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన, నమో భారత్ రైలు, మీరట్ మెట్రో విస్తరణను ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ వైఖరిపై మండిపడ్డారు. 80కిపైగా దేశాల ప్రతినిధులు, సుమారు 20 దేశాల అధినేతలు పాల్గొన్న సమ్మిట్ దేశానికి గర్వకారణం. అయితే కాంగ్రెస్ నాయకులు విదేశీ అతిథుల ముందు బట్టలు విప్పి నిరసన తెలపడం దేశాన్ని అవమానపరచడమే అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనా దివాళా తీసిందని, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఘటనను విమర్శించిన ఇతర ప్రతిపక్ష పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ వ్యవహారాలపై విమర్శలు
బడ్జెట్ సమావేశాల సమయంలో ఫిబ్రవరి 4న లోక్‌సభలో మహిళా ఎంపీలు బ్యానర్లు పట్టుకుని ప్రధాని సీటు వైపు వెళ్లిన ఘటనను కూడా మోడీ ప్రస్తావించారు. పార్లమెంట్ పనితీరును కాంగ్రెస్ దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రధాని కుర్చీలో కూర్చోవాలంటే ముందుగా ప్రజల మనసులు గెలుచుకోవాలి. ఇలా మహిళా ఎంపీలను ముందుకు నెట్టి రాజకీయాలు చేయడం సరైంది కాదని అన్నారు.
అభివృద్ధే లక్ష్యం
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ‘విషపూరిత రాజకీయాలు’ మానుకుని అభివృద్ధిలో పోటీ పడాలని గతంలోనే సూచించానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో గత దశాబ్దంలో ప్రజా సౌకర్యాలు, మౌలిక వసతులు మెరుగుపడ్డాయని, పరిశ్రమలు, సెమీకండక్టర్ ఫ్యాక్టరీ వంటి ప్రాజెక్టులు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో నేరాలను కట్టడి చేశామని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ను దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతుంది. అభివృద్ధి చెందిన యూపీ లేకుండా అభివృద్ధి చెందిన భారత్ సాధ్యం కాదని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
మహిళలు ఇబ్బందుల పడేవారు
ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యవస్థ మెరుగుదలతో పాటు మౌలిక వసతుల వేగవంతమైన అభివృద్ధి రాష్ట్రంలో ప్రజల నమ్మకాన్ని పెంచిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మీరట్‌లో ఒకే వేదికపై నమో భారత్ ర్యాపిడ్ రైల్, మీరట్ మెట్రో సేవలను ఆదివారం ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం సాయంత్రం తర్వాత ఈ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారేవి. ముఖ్యంగా మహిళలు భయాందోళనల మధ్య ప్రయాణించేవారు. ఇప్పుడు ప్రజా వ్యవస్థ మెరుగై, ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుతోందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఉదయం మెట్రో ప్రయాణంలో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో చేసిన సంభాషణను గుర్తు చేసుకున్నారు. అభివృద్ధి చెందిన ఉత్తరప్రదేశ్, అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యానికి ఇది కొత్త శక్తినిచ్చే విప్లవమని ఆయన పేర్కొన్నారు. ఒకే ప్లాట్‌ఫామ్ నుంచి నమో భారత్ ర్యాపిడ్ రైల్, మెట్రో సేవలను ఒకే రోజున ప్రారంభించడం అభివృద్ధి చెందిన భారత్‌లో కనెక్టివిటీ ఎలా ఉండబోతుందో చూపించిందన్నారు. మెట్రో నగరంలో సేవలందిస్తే, నమో భారత్ రైలు ట్విన్ సిటీల అభివృద్ధికి వేగం తీసుకువస్తుందని చెప్పారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనితీరు ప్రతిబింబించిందన్నారు.
మహిళా సాధికారతకు నిదర్శనం
నమో భారత్ ర్యాపిడ్ రైల్‌లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ట్రైన్ ఆపరేటర్లు, స్టేషన్ సిబ్బందిలో అనేక మంది మహిళలే ఉన్నారని, ఈ సేవ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తదితరులు హాజరయ్యారు. ప్రధాని మీరట్‌లో సుమారు రూ.12,930 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. మొత్తం 82 కిలోమీటర్ల ఢిల్లీ–మీరట్ నమో భారత్ కారిడార్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో ఢిల్లీలో సరై కాళే ఖాన్–న్యూ అశోక్ నగర్ మధ్య 5 కి.మీ, ఉత్తరప్రదేశ్‌లో మీరట్ సౌత్–మోదిపురం మధ్య 21 కి.మీ. భాగాలు ఉన్నాయి. గంటకు 180 కి.మీ. డిజైన్ వేగంతో నమో భారత్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ దేశంలో తొలి ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇది సాహిబాబాద్, ఘాజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన నగరాలను ఢిల్లీతో వేగంగా అనుసంధానిస్తుంది.
