Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా నన్ను అడ్డుకోలేదు: ప్రధాని మోడీ

కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా నన్ను అడ్డుకోలేదు: ప్రధాని మోడీ

Shaik Mohammad Shaffee
6 ఫిబ్రవరి, 2026

దేశాభివృద్ధిని అడ్డుకుంటూ, ద్వేషపూరిత రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. "నన్ను వ్యక్తిగతంగా ఎంతగా ద్వేషించినా, నా గొయ్యి తవ్వాలని ఎన్ని కలలు కన్నా.. కాంగ్రెస్ తన ప్రయత్నాల్లో ఎప్పటికీ విజయం సాధించలేదు" అని ఆయన తేల్చి చెప్పారు. గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ప్రధాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 100 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో విపక్షాల తీరును ఎండగడుతూనే, దేశ ఆర్థిక బలం, భవిష్యత్తు లక్ష్యాలను ఆయన వివరించారు.

ప్రజా దీవెనలే నాకు రక్షాకవచం

ప్రతిపక్షాలు తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలపై ప్రధాని ఘాటుగా స్పందించారు. 'మోదీ తేరీ కబ్ర్ ఖుదేగీ' (మోదీ నీ గొయ్యి తవ్వుతాం) అంటూ నినాదాలు చేస్తున్న వారు తమ నిరాశను బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. ఒక సామాన్య పేదవాడు దేశ ప్రధాని పదవిలో ఉండటాన్ని కాంగ్రెస్ అగ్ర కుటుంబం జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. ప్రధాని పదవి తమ కుటుంబ ఆస్తి అని వారు భావిస్తున్నారని, అందుకే నిత్యం తనను దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, దేశంలోని కోట్ల మంది తల్లులు, సోదరీమణులు, పేదల ఆశీస్సులు తనకు ఉన్నాయని, అవే తనను కాపాడుతాయని మోడీ స్పష్టం చేశారు.

రాష్ట్రపతిని అవమానించడం తగదు

లోక్‌సభలో విపక్షాలు సృష్టించిన గందరగోళంపై మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక పేద గిరిజన మహిళను (రాష్ట్రపతి) గౌరవించాల్సింది పోయి, ఆమె ప్రసంగంపై చర్చను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. అలాగే, కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టుపై రాహుల్ గాంధీ చేసిన "ద్రోహి" వ్యాఖ్యలను ప్రధాని తప్పుబట్టారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై చేసిన వ్యాఖ్య కాదని, మొత్తం సిక్కు సమాజానికే అవమానమని ఆయన దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదారులను రక్షిస్తూ, అక్కడి గిరిజనుల భూములను, యువత ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తోందని ఆరోపించారు.

ప్రపంచానికి భారత్ ఒక కొత్త దిక్సూచి

కరోనా అనంతర కాలంలో ప్రపంచం ఒక కొత్త అంతర్జాతీయ క్రమం వైపు పయనిస్తోందని, అందులో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. "ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. మనం గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) శక్తివంతమైన గొంతుకగా ఎదిగాం" అని సగర్వంగా ప్రకటించారు. గత 11 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఆర్థిక విజయాలను ఆయన ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. భారత్ ప్రస్తుతం అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణంతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా అడుగులు వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు.

వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుతూ..

యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాల గురించి మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. "మేము గత కొన్ని రోజుల్లోనే 9 కీలక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాం. ముఖ్యంగా 27 దేశాల కూటమి అయిన యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన ఒప్పందం అన్నిటికంటే పెద్దది. ఈ ఒప్పందాల వల్ల భారత యువతకు అపారమైన అవకాశాలు లభిస్తాయి" అని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో ఏ దేశమూ భారత్‌తో ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు రాలేదని, ఆ తప్పులను సరిదిద్దడానికి తన శక్తినంతా ధారపోస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

విపక్షాల వాకౌట్.. ఖర్గేపై చమత్కారం

ప్రధాని ప్రసంగం ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోడీ చమత్కరిస్తూ.. "ఖర్గే జీ వయసు దృష్ట్యా ఆయనను కూర్చునే నినాదాలు చేయనివ్వండి" అని వ్యాఖ్యానించారు. అనంతరం విపక్ష సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేశారు. వారు వెళ్ళిపోయాక.. "వారు అలసిపోయి వెళ్లిపోయారు, కానీ ఏదో ఒక రోజు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిందే" అని మోడీ ఎద్దేవా చేశారు.

వికసిత భారత్ లక్ష్యమే శ్వాసగా..

"కాంగ్రెస్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూసింది. కానీ మేము ప్రజలను దేశ బలంగా, సమస్యలకు పరిష్కారంగా భావిస్తాం" అని మోడీ అన్నారు. దేశం ఇప్పుడు 'రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్' (సంస్కరణల వేగం) మీద ఉందని, 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సభ వెలుపల ఖర్గే ధ్వజం

సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో విపక్ష నేత గొంతు నొక్కడం దారుణమని విమర్శించారు. లోక్‌సభలో జరిగిన పరిణామాలను నిరసిస్తూ తాము కేవలం రెండు నిమిషాల సమయం అడిగితే ఇవ్వలేదని, ఇది ప్రజాస్వామ్య మూలస్తంభాలను కూల్చడమేనని మండిపడ్డారు.

ప్రధాని ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి తీర్మానానికి లోక్‌సభ ఆమోదం

మరోవైపు పార్లమెంటరీ చరిత్రలో ఒక అరుదైన, అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గురువారం లోక్‌సభలో విపక్షాల హోరు, నిరంతర నినాదాల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది. సాధారణంగా ఇటువంటి చర్చల ముగింపులో ప్రధానమంత్రి సమాధానం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది, అయితే విపక్షాల తీవ్ర నిరసనల కారణంగా ఈసారి ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే తీర్మానం నెగ్గింది. స్పీకర్ ఓం బిర్లా విపక్షాలు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ ఓటింగ్‌కు పెట్టగా, అవి తిరస్కరణకు గురయ్యాయి. అనంతరం జనవరి 28న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ స్పీకర్ చదివిన తీర్మానాన్ని సభ సభ్యులు మూజువాణి ఓటుతో ఆమోదించారు. విపక్ష ఎంపీలు సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేస్తున్నప్పటికీ, సభా కార్యక్రమాలు కొనసాగి తీర్మానం ఆమోదం పొందడం గమనార్హం.

కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా నన్ను అడ్డుకోలేదు: ప్రధాని మోడీ - Tholi Paluku