
కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే రెండు పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు. డిసెంబర్ లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఎంఐఎంతో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఆ పార్టీకి మేయర్ పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. అందులో భాగంగానే ఈ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం సొంతగడ్డ అయిన హైదరాబాద్‌లో ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు.
మేయర్ పదవి వస్తే భయానక పరిస్థితి
ఎంఐఎం పార్టీ గనక మేయర్ పదవిని దక్కించుకుంటే హైదరాబాద్‌లో భయానక పరిస్థితులు వస్తాయిన రఘునందన్ రావు విమర్శించారు. భైంసాలో మేయర్ పదవి దక్కించుకున్న ఎంఐఎం హిందువులు ఉన్నకాలనీలకు నీళ్లు కూడా రాకుండా చేసిందని అదే విధంగా హైదరాబాద్‌లోనూ చేస్తారని ఆయన విమర్శించారు. అందుకే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే మేధావులు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా ఎంఐఎంకు ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు.
రాత్రికి రాత్రే కబర్‌స్తాన్‌లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాత్రికి రాత్రే కబర్‌స్తాన్‌లు ఎందుకు కట్టారని బీజేపీ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు. కేవలం ఎంఐఎం పార్టీకి భయపడే కబర్‌స్తాన్‌లు కట్టారని చెప్పుకొచ్చారు. ప్రజలు పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, 20 నెలల కాంగ్రెస్ పాలన చూశారు కాబట్టి ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
ముస్లింలు బలిపశువులు కావొద్దు
కాంగ్రెస్, ఎంఐఎం ఆడే డ్రామాలో ముస్లింలు బలిపశువువు కావొద్దని రఘునందన్ సూచించారు. ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. వాళ్లను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?
ఈ ఎన్నికల్లో గెలవాలంటే కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంక్ అత్యంత కీలకం. గత ఎన్నికల సమయంలో ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా మెలిగినప్పటికీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతోనే సంబంధాలు నెరుపుతున్నది. ఎంఐఎం నేతలకు చెందిన కాలేజీని హైడ్రా కూల్చకపోవడం వంటి అంశాలు రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం పెట్టుకున్నాయి అనే దానికి ఆధారమని విశ్లేషకులు అంటుంటారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీతో స్నేహపూర్వకంగా వ్యవహరించే ఎంఐఎం తన అభ్యర్థిని గత అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దించింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అభ్యర్థి అజహారుద్దీన్ ను పెట్టింది. దీంతో ముస్లింల ఓట్లు అటువైపుకు వెళ్లకుండా ఎంఐఎం అభ్యర్థిని బరిలో దించింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి హిందూ అభ్యర్థి పోటీలో ఉన్నారు. అందుకే ముస్లిం ఓట్లు గుంపగుత్తగా కాంగ్రెస్‌కు పడేలా వ్యూహం రచించినట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
