
కాంగ్రెస్ ఇప్పుడు రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతోంది: కిరెన్ రిజిజు
సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన నేను గాంధేయవాది, నెహ్రూవాది, రాజీవ్‌వాది.. కానీ రాహులియన్ కాదు అనే వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో క్రమంగా క్షీణించిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు పరిపక్వత కలిగిన బలమైన నాయకత్వం కాంగ్రెస్‌లో ఉండేదని, అయితే ఇప్పుడు పార్టీ పూర్తిగా రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతోందని రిజిజు విమర్శించారు. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ అదే నాయకత్వాన్ని కొనసాగించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. బీజేపీలో అయితే మూడు సార్లు ఓడిపోయిన నాయకుడు పదవిలో కొనసాగడని ఆయన అన్నారు.
ఈ వివాదం కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలతో ప్రారంభమైంది. అయ్యర్ మాట్లాడుతూ, వ్యక్తిగతంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని, అయితే ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం చేసిన పనితీరు దృష్ట్యా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముందని అన్నారు. కేరళ ప్రజలు అత్యంత తెలివైనవారు, స్వతంత్ర ఆలోచన కలిగినవారు. కాంగ్రెస్ కార్యకర్తగా యూడీఎఫ్ రావాలని కోరుకుంటున్నాను. కానీ గాంధేయవాదిగా నిజం చెప్పాల్సి వస్తే, ఎల్‌డీఎఫ్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే అయ్యర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయన అభిప్రాయం వ్యక్తిగతమని, పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించదని స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ, మణిశంకర్ అయ్యర్ ప్రస్తుతం పార్టీ సభ్యుడు కాదని తెలిపారు.
సోమనాథ్ చటర్జీ స్పీకర్ అయితే మొత్తం ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసేవారు
లోక్‌సభ స్పీకర్‌పై దాఖలైన అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లా వ్యవహారశైలిని మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తో పోల్చుతూ వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో రిజిజు మాట్లాడుతూ సభను సక్రమంగా నడిపించడం స్పీకర్ బాధ్యత, ప్రభుత్వ పనితీరుకు అవకాశం కల్పించడం, ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడమేనని అన్నారు. ఇటీవల కొందరు ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లి నిరసన చేపట్టిన సందర్భంలో ఓం బిర్లా అత్యంత సహనం, మృదుత్వం ప్రదర్శించారని తెలిపారు. సోమనాథ్ చటర్జీ గారు స్పీకర్‌గా ఉన్నట్లయితే, ఈ విధంగా ప్రవర్తించిన వారందరినీ సస్పెండ్ చేసి ఉండేవారని రిజిజు అన్నారు.
ఫిబ్రవరి 9న కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు సమర్పించారు. దీనికి సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) మద్దతు తెలిపాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తమ వైఖరిని ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ నేతలు ఇతర ప్రతిపక్ష పార్టీలతో చర్చలు కొనసాగిస్తున్నారు. రిజిజు ఆరోపణల ప్రకారం, సభలో కాగితాలు విసరడం, బ్యానర్లు ప్రదర్శించడం వంటి అవాంఛనీయ చర్యలకు ప్రధానంగా కాంగ్రెస్ ఎంపీలే కారణమని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కూడా కొన్ని సందర్భాల్లో అల్లరి చేస్తుందని, అయితే వారి నేతలతో చర్చించి సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే నేతలతో మేము స్నేహపూర్వకంగా పని చేయగలం. కానీ రాహుల్ గాంధీ ప్రవర్తన వల్ల చిన్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మాట్లాడే సమయాన్ని కోల్పోతున్నారు. తమ నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించే అవకాశం వారికి దక్కడం లేదని విమర్శించారు.
ఫిబ్రవరి 11న స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం దాఖలు చేసిన అనంతరం, కొందరు కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ చాంబర్‌లోకి వెళ్లి ఆయనపై వాగ్వాదానికి దిగారని ఆరోపించారు. ఈ ఘటనతో స్పీకర్ తీవ్రంగా బాధపడ్డారని, తాను వ్యక్తిగతంగా ఆయనతో మాట్లాడినట్లు తెలిపారు. సభలో మాట్లాడే హక్కులపై జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కొందరు పాటించలేదని అన్నారు. రాహుల్ గాంధీ నాకు ఎవరూ అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను కోరినప్పుడు మాట్లాడుతాను అని చెప్పినట్లు రిజిజు ఆరోపించారు.
