Let's talk: editor@tmv.in
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: ఎంపీ ఈటల

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: ఎంపీ ఈటల

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బుధవారం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సైదోనిగడ్డ తండాలో పర్యటన చేశారు. బీజేపీ అభ్యర్థులు మెగావత్ శాంతి జీవన్ నాయక్, అంకిత రవి నాయక్ తరపున ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు సంధించారు. ఉచిత బస్సు ప్రయాణం తప్ప, కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదు. పెన్షన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారు. కొత్తగా వికలాంగులైన వారికి లేదా భర్తలు చనిపోయిన మహిళలకు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా రాలేదు. ప్రతి మహిళకు ఇస్తానన్న రూ. 2500 ఏమయ్యాయి? అని ఆయన ప్రశ్నించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఏ పనీ చేయలేకపోతున్నామని చెప్తున్నారని, ఎమ్మెల్యేలే పనులు చేయలేనప్పుడు వార్డు కౌన్సిలర్లు ఏం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. నిధుల విషయంలో రేవంత్ రెడ్డి సాకులు చెబుతున్నారని, రాష్ట్రంలో నిధులు లేవని చెబుతున్న ముఖ్యమంత్రి ఇక అభివృద్ధి ఎలా చేస్తారని నిలదీశారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్, కాంట్రాక్టర్లకు బిల్లులు రాక రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాలకు వస్తున్న ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వమే పంపిస్తోందని ఈటల పేర్కొన్నారు. అమృత్ నగరాలు, స్మార్ట్ సిటీల పేరుతో పట్టణాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం నిధులు ఇస్తోంది. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారెడ్డి నందా రెడ్డి, జగన్, పూడూరు నరసింహారెడ్డి వంటి బీజేపీ సీనియర్ నాయకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: ఎంపీ ఈటల - Tholi Paluku