Let's talk: editor@tmv.in
కాంగ్రెస్‌లో చేరలేదు ఆ ప్రచారం అబద్ధం: ఎమ్మెల్యే కడియం

కాంగ్రెస్‌లో చేరలేదు ఆ ప్రచారం అబద్ధం: ఎమ్మెల్యే కడియం

Gaddamidi Naveen
18 డిసెంబర్, 2025

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా ఖండించారు. తన అనర్హతపై వివరణ కోరుతూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఆయన బుధవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినేనని, తన సభ్యత్వాన్ని ఎక్కడా రద్దు చేసుకోలేదని వివరణ ఇచ్చారు.

నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఎక్కడా, ఎవరికీ చెప్పలేదు. నాపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని ఆయన స్పీకర్‌కు సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా, భవిష్యత్తులో కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశం ఉందని ఎప్పుడూ ఏ వేదికపైన కూడా ప్రకటించలేదని తన వివరణలో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా ఆధారహీనమని, రాజకీయ ఉద్దేశాలతోనే ఈ ఫిర్యాదు దాఖలు చేయబడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

తాను పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నానని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ప్రజలిచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తున్నానని కడియం శ్రీహరి తన లేఖలో వివరించారు. పార్టీ మార్పు లేదా ఇతర పార్టీలతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై స్పీకర్‌కు పూర్తి స్థాయి వివరాలతో సమాధానం ఇచ్చానని, న్యాయపరంగా రాజ్యాంగ పరంగా తన స్థానం బలమైనదేనని కడియం శ్రీహరి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల ప్రతినిధిగా తన కర్తవ్యాలను నిర్వర్తించడమే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయ ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వనని ఆయన స్పష్టం చేశారు.

కడియం శ్రీహరి ఇచ్చిన ఈ వివరణతో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై నెలకొన్న రాజకీయ చర్చ మరింత ఉత్కంఠభరితంగా మారింది. స్పీకర్ ఈ వివరణను పరిశీలించిన అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.