Let's talk: editor@tmv.in
కాంగ్రెస్‌లో అయ్యర్ – థరూర్ మధ్య మాటల యుద్ధం

కాంగ్రెస్‌లో అయ్యర్ – థరూర్ మధ్య మాటల యుద్ధం

Pinjari Chand
13 మార్చి, 2026

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మణిశంకర్‌‌ అయ్యర్‌‌, శశిథరూర్ మధ్య ‘ఓపెన్ లెటర్ వార్’ చెలరేగింది. పార్టీ సహచరుడైన థరూర్‌తో ఇక తాను మార్గాలు వేరు చేసుకుంటున్నానని అయ్యర్ ప్రకటించగా, తనపై చేసిన వ్యాఖ్యలు అనవసరమైనవని థరూర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈ వివాదానికి నాంది అయ్యర్ రాసిన ఓ ఓపెన్ లెటర్. అది ఫ్రంట్‌లైన్ మేగజైన్‌లో ఈ వారం ప్రచురితమైంది. మార్చి 6న ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలిచివేశాయని అయ్యర్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, అమెరికా, పాశ్చాత్య దేశాలు కలిసి ఇరాన్‌పై కొనసాగిస్తున్న యుద్ధాన్ని అక్రమం, పాపపూరితమైనదిగా పేర్కొంటూ ఆయన విమర్శించారు. ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను తీవ్రంగా కలత చెందాను. రాత్రంతా నిద్రరాక తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ఓపెన్ లెటర్ రాయాల్సి వచ్చిందని అయ్యర్ పేర్కొన్నారు.

థరూర్‌కు మద్దతిచ్చానని అయ్యర్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో థరూర్‌కు తాను మద్దతిచ్చిన విషయాన్ని అయ్యర్ గుర్తుచేశారు. చివరికి ఆయన ఓడిపోతారని తెలిసినా కూడా తాను థరూర్‌కు ఓటు వేశానని చెప్పారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన మల్లికార్జున్‌ ఖర్గే థరూర్‌కు పార్టీ నిర్మాణంలో గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలని కూడా తాను వాదించానని అన్నారు. ఆ విషయం వల్ల గాంధీ కుటుంబం, ఖర్గే నన్ను కలవడం మానేశారు. అయినా నైతికంగా నేను సరైన పని చేశానని భావించానని అయ్యర్ తెలిపారు. అయితే ఇప్పుడు థరూర్ చేసిన వ్యాఖ్యలు తనను నిరాశకు గురి చేశాయని ఆయన విమర్శించారు.

విదేశాంగంపై విమర్శ

భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌‌ అమెరికాను ఎదుర్కోవడంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని థరూర్ చెప్పడాన్ని అయ్యర్ తప్పుబట్టారు. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పడం ద్వారా ‘బలమైనవారే సరి’ అన్న భావనకు థరూర్ మద్దతిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పటికీ విదేశాంగ నిర్ణయాలను పూర్తిగా ప్రభుత్వానికే వదిలేస్తే ఆ పదవిలో ఉండడమే ఎందుకని అయ్యర్ ప్రశ్నించారు. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు తీర్పును థరూర్ విమర్శించడాన్ని కూడా అయ్యర్ తప్పుబట్టారు.

థరూర్ ఘాటు ప్రతిస్పందన

ఈ విమర్శలకు ప్రతిగా థరూర్ కూడా ఓ ఓపెన్ లెటర్ రాశారు. అది మరో ఛానల్‌లో ప్రచురితమైంది. ప్రజాస్వామ్యంలో అభిప్రాయ భేదాలు సహజమని, కానీ వేరే విదేశాంగ దృక్పథం కలిగి ఉన్నందుకు సహచరుడి దేశభక్తిని ప్రశ్నించడం సరైంది కాదని థరూర్ అన్నారు. అంతర్జాతీయ వ్యవహారాలను నేను ఎప్పుడూ జాతీయ ప్రయోజనాల కోణంలోనే చూస్తాను. భారత భద్రత, ఆర్థిక ప్రయోజనాలు, అంతర్జాతీయ స్థానం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం ‘నైతిక లొంగుబాటు’ కాదు; అది బాధ్యతాయుతమైన రాజనీతీ అని థరూర్ పేర్కొన్నారు. తాను ప్రభుత్వానికి దగ్గర కావడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నానన్న ఆరోపణలను థరూర్ తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మాత్రమే నేను ఆల్‌పార్టీ ప్రతినిధి బృందాన్ని నడిపించాను. మిగతా విదేశీ ప్రయాణాలు నా వ్యక్తిగత ఆహ్వానాలపైనే జరుగుతాయి. అవి ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చినందుకు అయ్యర్‌కు కృతజ్ఞతలు తెలిపారు థరూర్. అయితే ఇప్పుడు ఆ నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం విచిత్రంగా ఉందని అన్నారు. అయితే తన వ్యక్తిత్వంపై వరుసగా చేస్తున్న వ్యాఖ్యలతోనే అసలు విభేదాలు మొదలయ్యాయని థరూర్ అన్నారు.

కాంగ్రెస్‌లో అయ్యర్ – థరూర్ మధ్య మాటల యుద్ధం - Tholi Paluku