Let's talk: editor@tmv.in
కాంగ్రెస్‌ను గద్దెదించే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్

కాంగ్రెస్‌ను గద్దెదించే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూల స్పందన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించిందని, క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న ప్రజాధారణ తగ్గలేదని ఆయన పేర్కొన్నారు.మొత్తం 2580 పైచిలుకు వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 750 వార్డులు బీఆర్ఎస్ పార్టీకి అందాయి. ఇది గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సాధించిన 40 శాతం విజయాన్ని మించి, మున్సిపల్ స్థాయిలో 30 శాతం పైగా వార్డులు గెలిచిన ఘన ఫలితంగా ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు వీరోచితంగా పోరాటం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయాన్ని బీఆర్ఎస్ పార్టీ యొక్క సమర్థమైన నాయకత్వం, గ్రామస్థాయి కార్యకర్తల కృషి, ప్రజల నమ్మకమే సాధించినదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక శక్తి ఉందని మరోసారి రుజువుచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని గద్దెదీయడం, బీజేపీని నిరోధించడం, తెలంగాణ ప్రజల ఆశల ప్రతీకగా ఉండడం కేవలం బీఆర్ఎస్ పార్టీ సాధ్యమని మరోసారి నిరూపితమైందని ఆయ‌న అన్నారు.

రేవంత్ సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు - హరీష్ రావు

మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక్కటైనా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును అడ్డుకోలేకపోయారని హరీష్ రావు విమర్శించారు. దాదాపు 700 పైగా వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం యాదృచ్ఛికం కాదని, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అటకెక్కించి, అభివృద్ధిని మందగించిన రేవంత్ సర్కార్‌కు పల్లె, పట్టణ ప్రజలు ఓటు అనే కొరడాతో బుద్ధి చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను గద్దె దించే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని పంచాయితీ, మున్సిపల్ ఫలితాలు స్పష్టం చేశాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో తెలంగాణలో మళ్ళీ గులాబీ జెండా ఎగురవేసే వరకు తమ పోరాటం ఆగదని హరీష్ రావు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ను గద్దెదించే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉంది: కేటీఆర్ - Tholi Paluku