

కాంగ్రెస్‌ది ‘దోచుకో-దాచుకో’ పథకం: కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి, తన ఉనికిని కేవలం దోపిడీ కోసమే పరిమితం చేసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆదివారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మానించిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అవినీతి తీరును, బీజేపీతో ఆ పార్టీకి ఉన్న అంతర్గత ఒప్పందాలను ఆయన ఎండగట్టారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాల పేరుతో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని విమర్శించారు.
సింగరేణిని ఏటీఎంలా వాడుకుంటున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ‘అవినీతి అడ్డా’గా మారిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే “దోచుకో-దాచుకో” అనే అలిఖిత పథకాన్ని అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా తెలంగాణ జీవనాడి అయిన సింగరేణి సంస్థను దోపిడీకి ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారని విమర్శించారు.
సీఎం బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి టెండర్లన్నీ సాగుతున్నాయి. 'సైట్ విజిటేషన్ సర్టిఫికేట్' పేరుతో కొత్త నిబంధనలు తెచ్చి, కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్-బీజేపీల మధ్య ‘చీకటి’ స్నేహం
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు పైకి విమర్శలు చేసుకుంటున్నా, లోపల మాత్రం ‘తోడు దొంగల’ మాదిరిగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి వచ్చి రాష్ట్రంలో 'ఆర్‌ఆర్' టాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ చేస్తున్నారు అని విమర్శించారు. కానీ రాహుల్-రేవంత్ టాక్స్ పైన ఇప్పటిదాకా విచారణకు ప్రధానమంత్రి ఎందుకు ఆదేశించలేదు? హోం మంత్రి అమిత్ షా వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటిఎంగా మారింది, అడ్డగోలుగా కుంభకోణాలు చేస్తుంది అన్నారు. కానీ దొంగలను పట్టుకోవాల్సిన కేంద్ర హోంశాఖ మంత్రి ఒక్క విచారణకు కూడా ఆదేశం ఇవ్వలేదు. అందుకే కాంగ్రెస్, బిజేపిలు ఒకరి దొంగతనం బయటపడకుండా ఇంకొకరు కాపాడుకుంటూ వస్తున్నారు అని ఆరోపించారు.
అణచివేత రాజకీయాలు - క్యాతనపల్లి సాక్షిగా..
క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 22 స్థానాలకు గాను 14 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించినా, అధికార బలంతో కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేశారని దుయ్యబట్టారు.
• మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను అక్రమంగా అరెస్టు చేసి, జైలులో ఇబ్బందులకు గురిచేయడం నీచమైన రాజకీయమని పేర్కొన్నారు.
• వేల మంది పోలీసులతో కవాతు నిర్వహించి, ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీని గుర్తుకు తెచ్చారని మండిపడ్డారు.
• ఎన్ని లక్షల రూపాయల బ్లాంక్ చెక్కులు ఇచ్చినా, బెదిరింపులకు పాల్పడినా లొంగకుండా నిలబడిన కౌన్సిలర్లను ఆయన కొనియాడారు.
బొగ్గు గనిపై అగ్గి పుట్టిస్తాం
సింగరేణి కార్మికుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. "కార్మికుల మెడికల్ బోర్డు సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. వారసత్వ ఉద్యోగాల పేరుతో కార్మికులను భయపెడితే ఊరుకోం. కాంగ్రెస్ తన వైఖరి మార్చుకోకపోతే సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ప్రతి బొగ్గు గనిపై మళ్ళీ పోరాట అగ్నిని పుట్టిస్తాం" అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని, కేసీఆర్ తిరిగి వస్తేనే రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఆయన పునరుద్ఘాటించారు.
కేసీఆర్ వస్తేనే మళ్లీ మంచి రోజులు
అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రజలపై భస్మాసుర హస్తాన్ని పెట్టింది. రైతుబంధుకు రామ్ రామ్.. దళితబంధుకు జై భీమ్ చెప్పి తెలంగాణను అమ్ముకుంటున్నారని కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు అక్షర సత్యాలవుతున్నాయని అన్నారు. 30 నెలలైనా ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కేసీఆర్ నాయకత్వం తిరిగి వస్తేనే రాష్ట్రం మళ్లీ సుభిక్షంగా మారుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
