
కాంగోలో విషాదం.. మైన్ వద్ద వంతెన కూలి 32 మంది మృతి
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగ్నేయ కాంగోలోని లువాలాబా ప్రావిన్స్‌లోని కలాండో రాగి గని వద్ద శనివారం ఒక వంతెన కూలిపోవడంతో కనీసం 32 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద గని ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది.
ప్రమాదానికి కారణమిదే!
ఈ ఘోర దుర్ఘటనకు గల కారణాలపై కాంగో అధికారులు, మైనింగ్ ఏజెన్సీ ప్రతినిధులు భిన్నమైన వివరాలను వెల్లడించారు. “భారీ వర్షపాతం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం కారణంగా సైట్‌లోకి ప్రవేశించకుండా కఠినంగా నిషేధం ఉన్నప్పటికీ, కార్మికులు బలవంతంగా క్వారీలోకి ప్రవేశించారు" అని ఈ ప్రావిన్స్ అంతర్గత మంత్రి రాయ్ కౌంబా మయోండే అన్నారు. అయితే కాంగో ఆర్టిసానల్ మైనింగ్ ఏజెన్సీ SAEMAPE కథనం ప్రకారం, కలాండో గని వద్ద భద్రతగా ఉన్న సైనిక సిబ్బంది తుపాకీ కాల్పులు జరపడంతో కార్మికులలో తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. ప్రాణభయంతో వందలాది మంది కార్మికులు అక్కడున్న ఓ ఇరుకైన వంతెనపైకి ఒక్కసారిగా దూసుకురావడంతో అది బరువును తట్టుకోలేక కుప్పకూలింది. వంతెన కూలడంతో కార్మికులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక చాలామంది మరణించినట్లు ఏజెన్సీ వివరించింది. వంతెన కూలడానికి ముందు సైనికులకు, అక్రమ తవ్వకం కార్మికులకు మధ్య ఘర్షణలు జరిగాయని కూడా ఆరోపణలు వస్తున్నాయని మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి.
మృతుల సంఖ్యపై గందరగోళం
లువాలాబా ప్రావిన్స్ అంతర్గత మంత్రి రాయ్ కౌంబా మయోండే అధికారికంగా ఈ ప్రమాదంలో 32 మంది మరణించినట్లు తెలిపారు. అయితే రాయిటర్స్, ఇతర ఏజెన్సీ వర్గాలు మృతుల సంఖ్య 49 వరకు ఉండవచ్చని, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నాయి. సహాయక చర్యలు ఆదివారం వరకు కొనసాగాయి. మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
ఈ ప్రమాదంలో సైన్యం పాత్రపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఇనిషియేటివ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కీలక డిమాండ్ చేసింది. ఈ ఘటనలో సైన్యం పాత్రపై స్వతంత్ర విచారణ జరపాలని వారు అధికారులను కోరారు.
కాంగో ప్రపంచంలోనే కోబాల్ట్ ఉత్పత్తిలో అతిపెద్ద దేశం. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇతర ఉత్పత్తుల కోసం లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేయడానికి కోబాల్ట్‌ను ఉపయోగిస్తారు. ఈ మధ్య ఆఫ్రికన్ దేశంలో ఉత్పత్తిలో 80 శాతం చైనీస్ కంపెనీల నియంత్రణలో ఉంది.
బాల కార్మికుల వినియోగం, సురక్షితం కాని పని ప్రదేశాలు, అవినీతి ఆరోపణలు చాలా కాలంగా ఈ దేశంలోని మైనింగ్ పరిశ్రమను పట్టి పీడిస్తున్నాయి. ఖనిజాలు సమృద్ధిగా ఉన్న తూర్పు కాంగో దశాబ్దాలుగా ప్రభుత్వ దళాలు, వివిధ సాయుధ సమూహాల హింసతో చిద్రమైపోయింది. రువాండా మద్దతు గల ఎం23 వంటి సాయుధ సమూహాల ఇటీవలి పునరుజ్జీవం, ఈ సంఘర్షణను పెంచి, అప్పటికే ఉన్న తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.
కాంగోలో లక్షలాది మందికి అశాస్త్రీయ గనుల తవ్వకమే ప్రధాన జీవనాధారం. సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా గని ద్వారా ఉపాధి పొందుతుండగా, పరోక్షంగా లక్షలాది మంది దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే కనీస భద్రతా చర్యలు పాటించకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. సొరంగాలు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో ప్రతి ఏటా అనేక మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
