
కాంగోలో కుప్పకూలిన గని.. 200 మందికి పైగా మృతి!
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఘోర ప్రమాదం సంభవించింది. తూర్పు కాంగోలోని కీలకమైన 'కోల్టాన్' గని మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 200 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు కాంగో ప్రభుత్వ అధికారులు బుధవారం వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఈ గనులు ఉన్న ప్రాంతం తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉండటంతో మృతుల సంఖ్యపై స్పష్టత రావడం లేదు. గత నెలలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగి 200 మందికి పైగా చనిపోవడం గమనార్హం.
తిరుగుబాటుదారుల వాదన వేరు
ఈ ప్రమాదం జరిగిన రుబాయా గని ప్రాంతం ప్రస్తుతం 'ఎం23' అనే తిరుగుబాటు ముఠా నియంత్రణలో ఉంది. ప్రభుత్వ గణాంకాలను ఆ ముఠా ప్రతినిధి ఫానీ కాజ్ ఖండించారు. బాంబు దాడుల వల్లే ప్రమాదం జరిగిందని, కేవలం ఐదుగురు మాత్రమే మరణించారని ఆమె వాదిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఇబ్రహీం అనే కార్మికుడు మాత్రం తాను స్వయంగా 200కు పైగా మృతదేహాలను వెలికితీశానని చెబుతున్నారు. గని యజమానులు అసలు మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.
స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకం
ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, విమాన ఇంజిన్ల తయారీలో వాడే 'కోల్టాన్' ఖనిజానికి కాంగో ప్రధాన వనరు. 2023 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లభించే కోల్టాన్‌లో 40 శాతం ఒక్క కాంగో నుంచే వస్తోంది. ప్రపంచానికి అవసరమైన టాంటలమ్ ఖనిజంలో 15 శాతం కేవలం ఈ రుబాయా గనుల నుంచే సరఫరా అవుతుంది. 2024 మే నెలలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఎం23 తిరుగుబాటుదారులు, కోల్టాన్ రవాణాపై పన్నులు వసూలు చేస్తూ నెలకు సుమారు 8 లక్షల డాలర్ల ఆదాయం పొందుతున్నట్లు ఐరాస నివేదికలు చెబుతున్నాయి.
హింస, అంతర్యుద్ధాలతో అల్లాడుతున్న తూర్పు కాంగో
దశాబ్దాలుగా సాగుతున్న హింస, అంతర్యుద్ధాలతో తూర్పు కాంగో అల్లాడిపోతోంది. సుమారు 70 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అమెరికా మధ్యవర్తిత్వంతో కాంగో, రువాండా ప్రభుత్వాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ, క్షేత్రస్థాయిలో పోరాటాలు మాత్రం తగ్గడం లేదు. ఒకవైపు ఖనిజ సంపద కోసం అంతర్జాతీయ స్థాయిలో పోటీ నడుస్తుంటే, మరోవైపు సరైన రక్షణ చర్యలు లేని గనుల్లో వేలాది మంది పేద కార్మికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.
