
కస్టమ్స్ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన: నిర్మలా సీతారామన్ తదుపరి పెద్ద సంస్కరణ
నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోనున్న ప్రధాన ఆర్థిక సంస్కరణలలో కస్టమ్స్ వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన తదుపరి పెద్ద సంస్కరణ అవుతుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం నాడు తెలిపారు. న్యూఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఎచ్ టి లీడర్‌షిప్ సమ్మిట్‌లో ఆమె మాట్లాడుతూ, కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని, వాటిని "మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉంది" అని చెప్పారు.
"చేయడానికి చాలా పనులు ఉన్నాయి, కానీ ప్రస్తుతం కార్డులో ఉన్నది, కస్టమ్స్ ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడం. ప్రస్తుతం ప్రజలకు అది చాలా శ్రమతో కూడుకున్నదిగా ఉంది. కస్టమ్స్ వ్యవస్థ నిబంధనలు, అంచనాలు పాటించడానికి భారంగా లేదని ప్రజలు భావించాలంటే మేము కస్టమ్స్‌ను మరింత సరళంగా మార్చాలి, దానిని మరింత పారదర్శకంగా చేయాలి."అని అన్నారు. ఇది బడ్జెట్‌కు ముందు నేను బయటపెడుతున్న రహస్యం కాదు అన్నారు.
సంస్కరణ లక్ష్యం - సరళత, పారదర్శకత
ప్రస్తుతం అమలులో ఉన్న కస్టమ్స్ విధానాలు అధికంగా శ్రమతో కూడుకున్నవిగా, భారంగా ఉన్నాయనే ప్రజల అభిప్రాయాన్ని మార్చాలని సీతారామన్ అన్నారు. "కస్టమ్స్ ప్రాంతాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడమే కాకుండా, సరళత, పారదర్శకత పాటించడమే ప్రస్తుతం కార్డులో ఉన్నది. అని ఆమె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాటించే ప్రమాణాలకు అనుగుణంగా, భారత కస్టమ్స్ వ్యవస్థను వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక దేశంలోకి లేదా బయటికి సరుకులు, జంతువులు, వాహనాలు, వ్యక్తిగత వస్తువులు, ప్రమాదకర వస్తువుల కదలికను నియంత్రించడానికి సుంకాలను వసూలు చేయడానికి బాధ్యత వహించే అధికార వ్యవస్థనే కస్టమ్స్ అంటారు. (కస్టమ్స్ అంటే దేశంలోకి, బయటికి వస్తువులు, వాహనాలు, ఇతర సామాగ్రి కదలికపై సుంకాలు వసూలు చేసే నియంత్రణ విధించే అధికార వ్యవస్థ) అని ఆమె వివరించారు.
సుంకాల తగ్గింపు కొనసాగింపు
గత రెండు సంవత్సరాలుగా కస్టమ్స్ సుంకాలను స్థిరంగా తగ్గిస్తూ వస్తున్నామని సీతారామన్ గుర్తుచేశారు. అయితే, కొన్ని వస్తువులపై ఇప్పటికీ సరైన స్థాయి కంటే ఎక్కువ రేట్లు ఉన్నాయని, వాటిని కూడా సమీక్షించి తగ్గించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. "మా తదుపరి పెద్ద ప్రక్షాళన పని కస్టమ్స్," అని ఆమె పునరుద్ఘాటించారు.
ఆదాయపు పన్నుతో పోలిక: 'పన్ను ఉగ్రవాదం'కు చెక్
గతంలో ఆదాయపు పన్ను వ్యవస్థ కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొందని, రేట్ల కంటే కూడా పన్ను పరిపాలన విధానమే ప్రధాన సమస్యగా ఉండేదని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పన్ను పరిపాలన బాధాకరంగా, వేదన కలిగించే విధంగా ఉన్నందువల్లే అప్పట్లో "పన్ను ఉగ్రవాదం" అనే పదం పుట్టుకొచ్చిందని, ఆ ముద్రను చెరిపేయడానికి తాము కృతనిశ్చయంతో ఉన్నామని ఆమె అన్నారు. ఫేస్‌లెస్ అసెస్‌మెంట్స్ వంటి సంస్కరణల ద్వారా ఆదాయపు పన్ను ప్రక్రియలను ఎలా శుభ్రం చేశారో, ఇప్పుడు అదే తరహా ఉన్నత ప్రమాణాలను కస్టమ్స్‌కు తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి ఉద్ఘాటించారు.
ద్వంద్వ సవాలు: భద్రత vs. సరళత
కస్టమ్స్ సంస్కరణలలో ఉన్న ద్వంద్వ సవాలును ఆమె విశ్లేషించారు. ఒకవైపు ప్రక్రియను క్రమబద్ధీకరించడం, మరోవైపు అక్రమ, నిషేధిత వస్తువుల నుండి దేశానికి రక్షణ కల్పించడం. సరుకు, కస్టమ్స్ అధికారుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించడం ద్వారా, సమగ్ర స్కానింగ్‌పై ఎక్కువ ఆధారపడటం ద్వారా విచక్షణను తగ్గించి, పారదర్శకతను పెంచవచ్చా అని ఆమె ప్రశ్నించారు. ఈ సంస్కరణల ద్వారా వ్యవస్థపై విశ్వాసాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీతారామన్ తెలిపారు.
