
కేసీఆర్ అమాయకుడు.. పక్కనోళ్లే తప్పుదోవ పట్టిస్తున్నారు..!
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన మలుపు చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కుమార్తె, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన తండ్రి కేసీఆర్ అమాయకుడని, ఆయన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారని కవిత ఆరోపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, చివరికి సాధారణ ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వెనుక గల కారణాలు ఏమిటి? కేసీఆర్ ఇమేజ్, ఆయన నిర్ణయాధికార విధానం, అలాగే పార్టీలోని అంతర్గత ఏం జరుగుతోంది?
ఆరోపణల్లో నిజాలేంటి?
కేసీఆర్ ఎవరి మాట వినరు అనే విషయాన్ని విస్మరించడం. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రతి కీలక నిర్ణయం కేసీఆర్ సొంతంగానే తీసుకున్నారు. మంచి అయినా, చెడు అయినా దాని పూర్తి క్రెడిట్, బాధ్యత కేసీఆర్ కే దక్కుతుందని పార్టీ వర్గాలే నమ్ముతాయి. ప్రగతి భవన్‌లో మంత్రులకు కూడా స్వేచ్ఛగా ప్రవేశం లేని పరిస్థితులు ఉన్నాయని గతంలో అనేకసార్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్‌కు తెలియకుండానే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత విమర్శించడం పార్టీ వర్గాలను, ప్రజలను గందరగోళానికి గురిచేస్తోంది.
కుటుంబ పరమైన సమస్యలు
ముఖ్యంగా చింతమడకలో జరిగిన సభలో కవిత తన తండ్రి కేసీఆర్‌తో పాటు సోదరుడు కేటీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూ హరీశ్ రావు, సంతోష్ రావులను లక్ష్యంగా చేసుకోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. నిజామాబాదులో తాను ఎంపీగా పోటీచేస్తే ఓడించేలా హరీష్ రావు, సంతోష్ ల ప్రణాళికలు రూపొందించారని, కుట్రపన్నారని కవిత గతంలో ఆరోపించారు. కేసీఆర్‌కు రాజకీయంగా ఎంత అనుభవం ఉందో హరీశ్ రావు, సంతోష్ రావుల రాజకీయ అనుభవం ఎంత? కేసీఆర్‌కు తెలియకుండానే నిజామాబాద్ లో కవిత ఓటమికి వారు ప్రయత్నించి ఉంటే ఆ విషయం కేసీఆర్ కు వెంటనే తెలిసేదన్నది అందరికీ తెలిసిన విషయం. కేసీఆర్‌కు నిజామాబాద్ జిల్లాలోనూ సన్నిహితులు ఉన్నారు. అందుకే "మా నాన్న బంగారం, పక్కనోళ్లే చెడగొడుతున్నారు" అనే కవిత వ్యాఖ్యలు ఎబ్బెట్టుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కేసీఆర్ మౌనం
కవిత ఆరోపణలపై కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఈ మౌనమే ఆమె ఆరోపణలను మరింత బలహీనపరిచింది. తరచుగా పార్టీకి వ్యతిరేకంగా, అంతర్గత విషయాలను బయటపెడుతున్నందుకే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోదరుడు కేటీఆర్ కూడా ఆమెను దూరం పెట్టారన్న వార్తలు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తున్నాయి. కాళేశ్వరంపై బీఆర్ఎస్ ఇప్పటికే అనేక విమర్శలు, సవాళ్లు ఎదుర్కొంటున్న తరుణంలో కవిత వ్యాఖ్యలు పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారాయి.
కాళేశ్వరంపై బాణాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై బీఆర్ఎస్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ సమయంలోనే కవిత తన ఆరోపణల అస్త్రాన్ని మరోసారి బయటకు తీయడం వెనుక వ్యూహం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. ఆమె వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విబేధాలను మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత ఆరోపణల పరంపరతో కేసీఆర్, కేటీఆర్ ఆమెకు దూరం పాటించడం స్పష్టం. ఇది కేవలం రాజకీయ విభేదం కాదని కుటుంబపరమైన సమస్యగా మారిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నందున ఆమెను సస్పెండ్ చేయాలనే కఠిన నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకోవడం పార్టీలో అంతర్గత క్రమశిక్షణకు సంకేతంగా భావిస్తున్నారు.
మొత్తం మీద కవిత వ్యాఖ్యలు ఆమెకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చడం లేదని స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ లోని అంతర్గత విభేదాలు, కుటుంబపరమైన సమస్యలు ఇప్పుడు బహిర్గతమవుతున్నప్పటికీ కేసీఆర్ ఇమేజ్ ను అవి ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోతున్నాయి. పార్టీకి కంచుకోటగా ఉన్న కేసీఆర్ పై ఆరోపణలు చేయడం ద్వారా కవిత తన రాజకీయ భవిష్యత్తును మరింత క్లిష్టపరిచే అవకాశం ఉందనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. కేసీఆర్ మౌనం, బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కఠిన నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
