Let's talk: editor@tmv.in
కష్టపడిన వాడికే లాభం రావాలి:హోంమంత్రి అమిత్ షా

కష్టపడిన వాడికే లాభం రావాలి:హోంమంత్రి అమిత్ షా

Pinjari Chand
24 ఫిబ్రవరి, 2026

భారత్ ట్యాక్సీలో కష్టపడిన వారికే లాభం చేరుతుందని, మధ్యలో ధనిక యజమానులకు కాకుండా డ్రైవర్లకే లాభం దక్కేలా ఈ మోడల్ రూపొందించామని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం ఢిల్లీలో భారత్ ట్యాక్సీ యాప్ సేవల క్యాబ్ డ్రైవర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సహకార ఆధారిత రైడ్-హైలింగ్ వేదికలో వారితో మాట్లాడారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో దేశంలోని తొలి సహకార ఆధారిత రైడ్-హైలింగ్ వేదిక ‘భారత్ ట్యాక్సీ’ను అమిత్ షా ప్రారంభించారు.

ఇతర యాప్‌లతో తేడా

డ్రైవర్లతో మాట్లాడిన షా, భారత్ ట్యాక్సీ, ఇతర రైడ్-హైలింగ్ సంస్థల మధ్య ఉన్న ప్రధాన తేడాను వివరించారు. కష్టపడిన వాడికే లాభం రావాలి, ధనిక యజమానులకు కాదు. కొన్ని యాప్‌లలో 30 శాతం వరకు కమీషన్ కట్ అవుతుందని మీరు చెప్పారు. అందుకే భారత్ ట్యాక్సీ ఆలోచన వచ్చిందని చెప్పారు. ఇతర కంపెనీలు యజమానులను ధనవంతులను చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాయని, కానీ భారత్ ట్యాక్సీలో డ్రైవర్లే యజమానులని స్పష్టం చేశారు.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులతో ఒప్పందం

ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్, సహకార్ ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, ఢిల్లీలోని 21 ప్రాంతాల్లో 34 ప్రీపెయిడ్ ట్యాక్సీ బూత్‌లను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇందువల్ల ప్రయాణికుల భద్రత, పారదర్శకత, డ్రైవర్ల ఆదాయం, సేవల నాణ్యత పెరుగుతాయని అధికారులు తెలిపారు. భారత్ ట్యాక్సీ, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో జాయింట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో రియల్-టైమ్ రైడ్ మానిటరింగ్, ఎస్‌ఓఎస్ అలర్ట్లు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలు ఉంటాయి.

డిజిటల్ ఇండియా మద్దతు

జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (ఎన్‌ఈజీడీ)తో కుదిరిన ఒప్పందం ద్వారా డిజిటల్ ఇండియా పరిధిలో సాంకేతిక సహాయం లభిస్తుంది. దీని ద్వారా డిజిలాకర్, ఉమాంగ్ వంటి ప్రభుత్వ సేవలతో అనుసంధానం, పేపర్‌లెస్ ఆన్‌బోర్డింగ్, క్యాష్‌లెస్ చెల్లింపులు వంటి సౌకర్యాలు కలుగుతాయి.

మెట్రో, ఎయిర్‌పోర్ట్ సౌకర్యాలు

ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ భాగస్వామ్యంతో ఢిల్లీలోని 10 ప్రధాన మెట్రో స్టేషన్ల వద్ద లాస్ట్-మైల్ కనెక్టివిటీ అందించనున్నారు. బైక్ ట్యాక్సీలు, ఈ-ఆటోలు, సిఎన్‌జి ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తో ఒప్పందం ద్వారా దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భారత్ ట్యాక్సీ కార్యకలాపాలకు అనుమతి లభిస్తుంది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ల వద్ద పార్కింగ్ సౌకర్యాల కోసం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ సర్వీసెస్‌తో ఒప్పందం కుదిరింది. మొదటి ఏడాది ప్రతి ట్రిప్ పికప్ ఫీజుపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంతో డ్రైవర్లకు అధిక ఆదాయం, ప్రయాణికులకు భద్రత, పారదర్శకత కల్పించడమే లక్ష్యమని అమిత్ షా తెలిపారు.