
కృష్ణానగర్‌లో పర్యటించిన మంత్రులు
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా డివిజన్ లోని కృష్ణానగర్ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షానికి వరదలు వచ్చి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ అధికారులతో కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీకర్ణన్, ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతూ, కృష్ణానగర్ ప్రాంతంలో వర్షం పడిన ప్రతీసారి వరదలు రావడానికి ప్రధాన కారణం నాలా వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే, పాతబడ్డ నాలాలను బాగు చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారిస్తుందని పేర్కొన్నారు
దీనివల్ల కృష్ణానగర్లో నీటి ప్రవాహం నిలిచిపోయి వరదలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. అలాగే ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న నాలాలను అభివృద్ది చేయడం కోసం నాలాల అభివృద్ధి ప్రణాళిక ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు మంజూరు చేశామని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్బంగా జీహెచ్ఎంసీ పరిధిలో కృష్ణానగర్లో కొనసాగుతున్న పెండింగ్ అభివృద్ధి పనులపై మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగించేలా జీహెచ్ఎంసీ వ్యవస్థ మరింత సమర్థంగా పని చేయాలని అన్నారు. అలాగే శానిటేషన్ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది వర్షాల సమయంలో వరద నీరు నిలిచే ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, డెంగీ వంటి వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కారానికి వచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రజలతో సంబంధాన్ని బలోపేతం చేసుకుంటూ, వారిని నేరుగా కలసి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
