Let's talk: editor@tmv.in
కశ్మీర్ లోయలో.. మొదలైన మంచుకురిసే వేళ

కశ్మీర్ లోయలో.. మొదలైన మంచుకురిసే వేళ

Pinjari Chand
22 డిసెంబర్, 2025

జమ్మూలోని కశ్మీర్ లోయలో శీతాకాలంలో చలి తీవ్రమైంది. గాండర్‌బల్ జిల్లాలోని సోనమార్గ్‌లో ఆదివారం ఈ సీజన్ తొలి హిమపాతం కురిసింది. రాజధాని శ్రీనగర్‌లో తీవ్ర చలి, దట్టమైన పొగమంచు కొనసాగుతోంది.

సోనమార్గ్‌లో కురిసిన తాజా మంచుతో వాహనాలు, భవనాలు, రహదారులు తెల్లని మంచు దుప్పటిలో కప్పుకుపోయాయి. స్థానికులు, పర్యాటకులు మంచు ముద్దలతో ఆటలు ఆడుతూ, ఉదయపు నడక చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. యాత్రికులు హిమపాతం కురవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అసోం నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు, చలి ఎక్కువగా ఉండటంతో రెండు పొరల దుస్తులు, టోపీలు వేసుకోవాల్సి వస్తోంది. మంచు కురిస్తే పర్యటన మరింత ఆనందంగా ఉంటుందని తెలిపారు. పంజాబ్‌కు చెందిన గగన్ అనే పర్యాటకుడు మాట్లాడుతూ, గతేడాది మంచు లేకపోయినా ఈసారి డిసెంబర్‌లోనే హిమపాతం సూచనలు కనిపిస్తున్నాయని పర్యాటకులు నిశ్చింతగా రావచ్చని చెప్పారు.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం శ్రీనగర్‌లో డిసెంబర్ 20తో పోలిస్తే ఉష్ణోగ్రతలు సుమారు 4 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గాయి. దాల్ సరస్సు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నప్పటికీ, శికారా బోటు ప్రయాణాలు, పర్యాటక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అధికారులు చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు, పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలని సూచించారు.

శ్రీనగర్ లో చిల్లై–కలాన్ ప్రారంభం

కశ్మీర్ లోయలో 40 రోజుల పాటు కొనసాగే అత్యంత కఠినమైన శీతాకాల దశగా పిలవబడే ‘చిల్లై–కలాన్’ ఆదివారం ప్రారంభమవడంతో, ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం, మైదాన ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం గుల్‌మార్గ్‌లో హిమపాతం నమోదైంది. అక్కడ సుమారు రెండు అంగుళాల మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్వోసీ) వెంట ఉన్న టాంగ్‌ధార్ సెక్టార్‌ను ప్రధాన కశ్మీర్ లోయతో కలిపే సాధ్నా టాప్‌లో మోస్తరు హిమపాతం కురిసింది. శనివారం రాత్రి నుంచి అక్కడ సుమారు ఆరు అంగుళాల మంచు పేరుకుపోయినట్లు వెల్లడించారు.

శ్రీనగర్‌తో పాటు లోయలోని ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి తేలికపాటి వర్షం ప్రారంభమై, ఆదివారం మధ్య మధ్యలో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. వచ్చే 48 గంటల్లో లోయలో హిమపాతం, వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ఇప్పటి వరకు ఉన్న పొడివాతావరణం కారణంగా పిల్లలు, వృద్ధుల్లో ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సాధారణ రోగాలు పెరిగినట్లు అధికారులు తెలిపారు. చిల్లై–కలాన్ తొలి రోజున వర్షం, మంచు కురవడం స్థానికంగా శుభ సూచకంగా, రాబోయే రోజుల్లో మరింత మంచు కురిసే సూచనగా భావిస్తారు. చిల్లై–కలాన్ (తీవ్రమైన చలి) కాలం జనవరి 30తో ముగుస్తుంది. ఆ తర్వాత ‘చిల్లై–ఖుర్ద్’ (మామూలు చలి), తదుపరి ‘చిల్లై–బాచా’ (సాధారణంగా ఉండే చలి) దశలు కొనసాగుతాయి.