Let's talk: editor@tmv.in
కశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేసింది నెహ్రూనే: సీఎం యోగి ఆదిత్యనాథ్

కశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేసింది నెహ్రూనే: సీఎం యోగి ఆదిత్యనాథ్

Pinjari Chand
16 డిసెంబర్, 2025

కశ్మీర్ లో ఉద్భవించిన ఉగ్రవాదం, వేర్పాటువాదానికి కారణం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూనేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. స్వాతంత్ర్యం అనంతరం జమ్మూ కాశ్మీర్ అంశాన్ని నెహ్రూ అత్యంత వివాదాస్పదంగా మార్చారని, దాని ప్రభావం నేటికీ దేశాన్ని వెంటాడుతోందని ఆయన అన్నారు.

భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 75వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన యోగి, స్వాతంత్ర్యం సమయంలో 560కిపైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు ఈ ప్రక్రియలో పెద్ద సవాళ్లుగా నిలిచాయని గుర్తు చేశారు. భారతదేశంలోని హిందూ సంస్థానాలన్నీ భారత యూనియన్‌లో కలవడానికి అంగీకరించాయి. కానీ జునాగఢ్ నవాబు, హైదరాబాద్ నిజాం మాత్రం భారత్‌లో విలీనానికి నిరాకరించారు. సర్దార్ పటేల్ దూరదృష్టి వల్ల రక్తపాతం లేకుండా ఈ రెండు సంస్థానాలు భారత్‌లో భాగమయ్యాయని తెలిపారు. స్వాతంత్ర్యం సమయంలో మొత్తం 567 సంస్థానాలు ఉన్నాయని, వాటన్నింటినీ భారత గణతంత్రంలో విలీనం చేసిన ఘనత సర్దార్ పటేల్‌కేనని యోగి చెప్పారు. దేశ నిర్మాణ శిల్పి సర్దార్ వల్లభభాయ్ పటేల్. భారత ఏకత్వానికి ఆయనే పునాది అని కొనియాడారు. బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత సంస్థానాలకు భారత్ లేదా పాకిస్తాన్‌లో చేరాలా, స్వతంత్రంగా ఉండాలా అనే ఎంపిక ఇచ్చారని, ఆ సమయంలో జునాగఢ్ నవాబు, హైదరాబాద్ నిజాం భారత్‌లో కలవడానికి ఇష్టపడలేదని యోగి గుర్తు చేశారు.

కశ్మీర్ భవితవ్యంపై అప్పట్లోనే అనిశ్చితి

పండిట్ నెహ్రూ స్వయంగా కశ్మీర్ వ్యవహారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన జమ్మూ కశ్మీర్‌ను అంతగా వివాదాస్పదం చేశారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా అది భారతదేశాన్ని గాయపరుస్తూనే ఉంది. కశ్మీర్ నుంచే దేశానికి ఉగ్రవాదం (ఉగ్రవాద్), వేర్పాటువాదం (అలగ్ వాద్) వచ్చాయి అని ఆరోపించారు. సర్దార్ పటేల్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ కలలను ప్రధాని నరేంద్ర మోడీ నెరవేర్చారని యోగి పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగంగా మారింది. ‘ఒక దేశం–ఒక రాజ్యాంగం–ఒక జెండా’ అనే సంకల్పం ముందుకు సాగుతోందని అన్నారు.

సర్దార్ పటేల్ సేవలను స్మరించుకున్న యోగి

సోమనాథ ఆలయ పునరుద్ధరణ నుంచి, దేశంలో అంతర్గత వివాదాల పరిష్కార యంత్రాంగం ఏర్పాటు వరకు, భారత పరిపాలనా సేవలకు (ఐఏఎస్) ప్రస్తుత రూపం ఇవ్వడం వరకు—అన్నీ సర్దార్ పటేల్ ముందుచూపు ఫలితాలే అని అన్నారు. దేశానికి ఇంకా కొంతకాలం సర్దార్ పటేల్ నాయకత్వం అవసరమైన సమయంలోనే ఆయన 1950 డిసెంబర్ 15న పరమపదించారు. అది దేశానికి దురదృష్టం అని వ్యాఖ్యానించారు.

ఎక్స్ వేదికగా సర్దార్ పటేల్‌కు యోగి ఆదిత్యనాథ్ నివాళులు

ఉత్తరం నుంచి దక్షిణం, తూర్పు నుంచి పడమర వరకు భారత ఐక్యతకు రూపశిల్పి, ‘ఐరన్ మ్యాన్’, భారతరత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు వర్ధంతి నివాళులు అని ఆయన పోస్టు చేశారు.

ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా పటేల్‌కు నివాళులర్పించారు.

మౌర్య తన హిందీ పోస్టులో దేశ ఐక్యతకు బలమైన పునాది వేసిన ఐరన్ మ్యాన్ సర్దార్ పటేల్ జీవితం ధైర్యం, కర్తవ్యబద్ధత, దేశసేవకు ప్రతీక అని పేర్కొన్నారు. 1875లో గుజరాత్‌లోని నడియాద్‌లో జన్మించిన సర్దార్ వల్లభభాయ్ పటేల్, స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా వ్యవహరించిన ఆయన, అప్పట్లో ఉన్న సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో ప్రధాన పాత్ర వహించారు.

కశ్మీర్ అంశాన్ని వివాదాస్పదం చేసింది నెహ్రూనే: సీఎం యోగి ఆదిత్యనాథ్ - Tholi Paluku