Let's talk: editor@tmv.in
కవాడిగూడ, ముషీరాబాద్‌లలో నూతన జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల ప్రారంభం

కవాడిగూడ, ముషీరాబాద్‌లలో నూతన జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల ప్రారంభం

Gaddamidi Naveen
22 జనవరి, 2026

ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సికింద్రాబాద్ జోన్ పరిధిలో ప్రజలకు మరింత సమీపంగా పౌర సేవలు అందించాలనే లక్ష్యంతో 10.50 కోట్ల రూపాయల తో నూతనంగా నిర్మించిన సర్కిల్ కార్యాలయాలను ప్రారంభించారు. కవాడిగూడ, ముషీరాబాద్ ప్రాంతాల్లో నూతనంగా స్థాపించిన జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, పొన్నం ప్రభాకర్ ఘనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మూత గోపాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యాలయాల ప్రారంభం ద్వారా వికేంద్రీకృత పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, పౌరుల సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం కలుగుతుందని వారు పేర్కొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన సేవలు నేరుగా వారి ప్రాంతాల్లోనే అందుబాటులోకి రావడం వల్ల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అన్నారు. అలాగే, డిప్యూటీ కమిషనర్లు, సర్కిల్ సిబ్బందిని అభినందిస్తూ, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలన, ప్రజాకేంద్రిత సేవలందింపులో వారు మరింత నిబద్ధతతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

నూతన జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలు ప్రారంభం కావడం ద్వారా రోడ్లు, పారిశుధ్యం, డ్రైనేజీ, లైటింగ్ వంటి పౌర సౌకర్యాలపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే వీలుంటుందని అధికారులు తెలిపారు. మొత్తంగా, ఈ కార్యాలయాలు నగరవాసులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.