
క్వార్టర్స్లోకి దూసుకెళ్లిన సింధు, సాత్విక్ జోడీ
చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు. మహిళల సింగిల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లారు. ఇద్దరూ తమ తమ మ్యాచ్లలో స్ట్రెయిట్ గేమ్స్లో విజయం సాధించారు.
సింధు జోరు
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ప్రి-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ప్రపంచ ఆరవ ర్యాంకర్ అయిన థాయిలాండ్కు చెందిన పోర్న్పావీ చోచువాంగ్పై కేవలం 41 నిమిషాల్లోనే విజయం సాధించారు. ఈ మ్యాచ్లో సింధు 21-15, 21-15 తేడాతో గెలిచారు. ఈ విజయంతో చోచువాంగ్తో తన హెడ్-టు-హెడ్ రికార్డ్ను 6-5కు మెరుగుపరుచుకున్నారు. మ్యాచ్ అనంతరం సింధు మాట్లాడుతూ, ’ఈ విజయం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. చోచువాంగ్ ఒక అగ్రశ్రేణి క్రీడాకారిణి. గతంలో ఇండోనేషియా ఓపెన్లో ఆమెతో చాలా కఠినమైన మ్యాచ్ ఆడాను. ఈసారి మొదటి గేమ్ గెలిచిన తర్వాత నేను మరింత అప్రమత్తంగా ఉన్నాను. ప్రతి పాయింట్ ముఖ్యమని భావించాను. నేను గెలిచినందుకు సంతోషంగా ఉంది, నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను’ అని పేర్కొన్నారు.
గత వారం హాంకాంగ్ ఓపెన్లో మొదటి రౌండ్లోనే ఓటమిపాలైన సింధు, ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించారు. ‘మొదటి గేమ్ గెలిస్తే, రెండో గేమ్లోనే ముగించడం మంచిది. స్ట్రెయిట్ గేమ్స్లో గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే లాంగ్ మ్యాచ్లకు కూడా సిద్ధంగా ఉండాలి, వేగంగా కదలడం ముఖ్యం’ అని సింధు తెలిపారు. క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ప్రపంచ నంబర్ 1, దక్షిణ కొరియాకు చెందిన అన్ సే-యంగ్తో తలపడనున్నారు. అన్ సే-యంగ్తో సింధు గతంలో ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయారు.
సాత్విక్-చిరాగ్ జోడీకి సునాయాస విజయం
పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్ 3 జోడీ సాత్విక్-చిరాగ్, చైనీస్ తైపీకి చెందిన వాంగ్ చి-లిన్, చియు హ్సియాంగ్-చియెతో కేవలం 33 నిమిషాల్లోనే 21-13, 21-12 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో వారు క్వార్టర్ ఫైనల్స్లో చైనాకు చెందిన రెన్ జియాంగ్ యు, షీ హావ్నాన్తో తలపడనున్నారు.
ఈ మ్యాచ్ గురించి చిరాగ్ మాట్లాడుతూ, ‘వాంగ్ చి-లిన్, చియు హ్సియాంగ్-చియెతో ఆడటం ఎప్పుడూ కష్టమే. కానీ మేము సునాయాసంగా గెలిచినందుకు సంతోషంగా ఉంది. గత వారం హాంకాంగ్లో మాకు మూడు గేమ్లు పట్టాయి, కానీ ఇక్కడ 33 నిమిషాల్లోనే ముగించాం. ఈసారి మాకు ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది’ అని పేర్కొన్నారు. సాత్విక్ మాట్లాడుతూ, ‘హాంకాంగ్లో మేము మొదటి రౌండ్లో లెఫ్టీ-రైటీ జోడీతో, రెండో రౌండ్లోనూ అదే విధంగా ఆడాం. ఇక్కడ కూడా నిన్న, ఈ రోజు అదే పరిస్థితి. ఇంతమంది లెఫ్టీ-రైటీలతో ఎప్పుడూ ఆడలేదు. చైనీస్ జోడీలు మంచి స్ట్రోక్లతో వస్తారు’ అని చెప్పారు. షెన్జెన్ తమకు ప్రత్యేకమైనదని, గతంలో సెమీ-ఫైనల్లో రన్నరప్గా నిలిచామని, ఈసారి టైటిల్ గెలవాలని ఆశిస్తున్నామని సాత్విక్ తెలిపారు.
