
కవిత వ్యూహం ఫలించేనా?
జాగృతి అధ్యక్షురాలు కవిత సామాజిక తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్‌కు గురైన కవిత రాజకీయంగా రాణించేందుకు యత్నిస్తున్నారు. గులాబీ పార్టీలో ఉన్నప్పటి నుంచే సామాజిక తెలంగాణ నినాదాన్ని అందుకున్న కవిత, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగంగా కల్పించడమే తన లక్ష్యమని చెబుతున్నారు. మరి కవితకు నిజంగానే ఆయా వర్గాలు దగ్గరవుతాయా? ఆమె రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తాయా? కవిత తెలంగాణ రాజకీయాల్లో రాణించగలరా? కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి కవిత పార్టీ పెడితే ఎవరికి నష్టం? ఎవరికి లాభం? అన్న చర్చ మొదలైంది. ఆమె వెంట ముఖ్యమైన నేతలు ఎవరైనా కలిసివస్తారా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
బీసీ నేతలను ఆకట్టుకునే యత్నం
కవిత.. వివిధ జిల్లాల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలను కలుసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ అవకాశాలు దక్కని బీసీ నేతలను, ఇతర పార్టీల్లోని బీసీ, ఎస్సీ, గిరిజన నేతలతో ఆమె తరుచూ సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం మల్లన్న తెలంగాణ రాజ్యాధికార సమితి అనే పార్టీని స్థాపించి బీసీలను ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లు వంటి అంశాల ఆధారంగా బీసీలను కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కవిత రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయా? ఆమె నిజంగానే బీసీలను తమ వైపు తిప్పుకోగలరా? అన్న చర్చ సాగుతోంది. బీజేపీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదం ఎత్తుకున్నది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటూ ప్రకటించింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్ లాంటి నేతలు ఆ పార్టీలో ఉన్నారు. ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారన్న చర్చ జరిగినా ఆయనకు ఆ పదవి దక్కలేదు. పార్టీలోని అంతర్గత విబేధాలే అందుకు కారణం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి.
ఇప్పటి వరకు రాష్ట్రంలో బీసీలు ఒక్కటిగా ఉండి ఒకే పార్టీకి ఓటు వేశారని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలను ఎక్కువగా ప్రోత్సహించింది. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాస్త బలహీనంగా ఉంది. టీడీపీకి చెందిన చాలా మంది బీసీ నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల ఓట్ల కోసం పార్టీలు పోటీ పడుతున్నాయి.
సామాజిక తెలంగాణ నినాదం
కవిత బీసీ రిజర్వేషన్ల కోసం 72 గంటల దీక్ష చేశారు. కుల సర్వే వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో బీసీ ఓటర్లను ఆకర్షించడం అంత సులభమేమీ కాదు. పైగా కవిత అగ్రవర్ణానికి చెందిన నేత. ఆమెను బీసీలు తమ సొంత మనిషిగా గుర్తించడం, తమకు ఆమె పార్టీ వల్ల న్యాయం జరుగుతుందని నమ్మడం అంత తేలికకాదు. అంతేకాక రాష్ట్రంలో బీసీల కోసం పుట్టుకొచ్చిన పార్టీ ఒకటి ఉంది. అదే తీన్మార్ మల్లన్న స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార సమితి. మల్లన్నకు యువతలో క్రేజ్ ఉంది. ఆయన ప్రసంగం ఎంతో ఘాటుగా, బీసీ వర్గాలను దగ్గర చేసేలా ఉంటుంది. ఇక ఎస్సీలను ఏకం చేసేందుకు విశారధన్ మహారాజ్ అనే నేత ధర్మస్వరాజ్ పార్టీని స్థాపించారు. ఊరూరా బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఆ వర్గాల్లో కొంత పట్టు ఉంది. ఇటువంటి అంశాలు కవితకు ప్రతిబంధకాలే.
బీసీలను ఏకంగా చేసేందుకు కాంగ్రెస్ యత్నం
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీసీలను ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే రాహుల్ గాంధీ పదే పదే కులగణన అంశాన్ని లేవనెత్తుతున్నారు. దేశంలో ఎన్నో అణగారిన వర్గాలు ఉన్నాయని.. వారికి రాజకీయంగా అవకాశాలు రావాల్సి ఉందని ఆయన పిలుపునిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి దళితుల మద్దతు దక్కుతోంది. మైనార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచేవారు. అయితే యూపీలో బీఎస్పీ లాంటి పార్టీలు ఆవిర్భవించాక దళితులు కొంత మేర చీలిపోయారనే చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ హిందూ ఏకీకరణ పేరిట అన్ని కులాలను ఒక్కతాటికి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కులాల కుమ్ములాటలు లేకుండా హిందువులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చి తద్వారా వారి ఓట్లను తన ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నది. దేశ భద్రత, అవినీతి రహిత పాలన వంటి అంశాలు కూడా బీజేపీకి కొంతమేర కలిసివస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి బీసీ వర్గాలను దూరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని పదే పదే తెరమీదకు తీసుకొస్తుందన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇదే వ్యూహం అవలంబిస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బీసీల ఎదుట ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పుడు వారు కవిత వైపు వస్తారా? అన్నది మరో ప్రశ్న.
కవిత బలం ఏమిటి?
కవిత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు బతుకమ్మ పండగలో ఊరూరా పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని సాంస్కృతికంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో కవితకు తెలంగాణ రాష్ట్రంలో కొంత మంచి పేరు వచ్చింది. ఆమె ఉద్యమ సమయంలో బలంగా పోరాడటంతో ప్రజల మద్దతు దక్కింది. కవిత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 2014లో గెలుపొందిన కవిత.. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటికి ఆమెకు కొంత ప్రజాదరణ తగ్గింది. అనంతరం లిక్కర్ స్కామ్ వంటి అంశాలు ఆమె ప్రతిష్ఠను దిగజార్చాయి. కేసీఆర్ కూతురుగా బలమైన గొంతుక వినిపించే కవిత.. తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీనే విబేధించారు. ఇలా ఆమె రాజకీయ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులున్నాయి. అయితే కవిత జైలుకు వెళ్లినప్పుడు ఆమె మీద పెద్దగా సానుభూతి వ్యక్తం కాలేదు. పైగా లిక్కర్ స్కామ్ కేసులో అది కూడా ఢిల్లీలో జరిగిన కుంభకోణంలో కవిత పాలుపంచుకున్నట్టు ఆరోపణలు రావడంతో ఆమెకు చెడ్డపేరు వచ్చింది. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఆమె మీద ప్రజల్లో నిజంగా సానుభూతి వచ్చినట్టు కనిపించడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో కవిత రాణించగలరా? అన్నది వేచి చూడాలి. అయితే తనకు బలమైన క్యాడర్ ఉందని కవిత భావిస్తున్నారు. జిల్లాల్లో జాగృతిని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కేసీఆర్ రంగంలోకి దిగుతారా?
అయితే కవిత వ్యవహారం మీద ఇప్పటి వరకు కేసీఆర్ బహిరంగంగా స్పందించలేదు. కేటీఆర్ మాత్రమే మాట్లాడారు. కవిత కేవలం కుటుంబ సమస్యలతోనే బయటకు వచ్చారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమెకు తన సోదరుడితో ఆస్తి తగాదాలు ఉన్నాయని.. అందుకే కవిత బయటకు వచ్చారని వారు అంటున్నారు. అదే నిజమైతే కేసీఆర్ ఒక వేళ రంగంలోకి దిగి వీరి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం లేకపోలేదు. అప్పుడు కవిత వెనక్కి తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి కవిత నిజంగానే పార్టీ స్థాపిస్తారా? లేదంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకే వెళ్లిపోతారా? అన్నది వేచి చూడాలి. మరి ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
కవిత లిక్కర్ స్కామ్ కేసులో జైలుకెళితే
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసులో ప్రస్తుతం ఆమె బెయిల్ మీద బయటకు వచ్చారు. ఒక వేళ కేసు మళ్లీ తిరగదోడి కవిత జైలుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏం జరుగుతుందో వేచి చూడాలి. అప్పుడు కవితకు మద్దతుగా కేసీఆర్ ఫ్యామిలీ అండగా నిలబడుతుందా? లేదా? అన్నది కూడా అనుమానమే. మొత్తంగా కవిత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తాను ప్రముఖ పాత్ర పోషించాలని.. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తనకు గుర్తింపు దక్కడం లేదు కాబట్టి సొంతంగా పార్టీకి పెట్టుకొని రాణించాలని చూస్తున్నారు. అయితే ఆమె రాజకీయ ప్రయాణం పూర్తిస్థాయిలో మొదలుపెట్టకముందే అనేక అవాంతరాలు సవాళ్లు, ఎదురవుతున్నాయి. ఆమె ఎలా వీటిని ఎదుర్కొంటుందో వేచి చూడాలి.
