Let's talk: editor@tmv.in
కవితను బీసీలు నమ్మరు

కవితను బీసీలు నమ్మరు

Pinjari Chand
21 సెప్టెంబర్, 2025

ఇన్ని రోజులు బీసీలను మరిచిన జాగృతి అధ్యక్షురాలు కవితకు ఉన్నట్టుండి వారు గుర్తుకు రావడమంటే ఇదో డ్రామా అని మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని బీసీలు కవితను నమ్మరని, కొత్తగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిన మల్లన్నను నమ్మే అవకాశం ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె బీసీ అయినంతా మాత్రాన ఎవరూ ఆమె వెంట నడవరని ఎద్దేవా చేశారు. కవిత తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది వ్యాపారవేత్తల, ఆయా వర్గాల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. కవిత శవాల మీద పేలాలు ఏరుకునే రకమని వివరించారు. విమలక్కను ఉద్యమ సమయంలో బాగా వేధించిందని ఆరోపించారు.

మళ్లీ రేవంత్​ రెడ్డే సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి అద్భుతంగా పని చేస్తున్నారని మధుయాష్కీ కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి కూడా రేవంతే అన్నారు. ఆయన తరువాత సీఎం ఎవరనే చర్చ అవసరం లేదన్నారు. వేరే రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, పార్టీలో ఆయన ప్రాధాన్యం ఎంటో దీన్ని బట్టే తెలుస్తుందన్నారు. అలాగే కవిత ఇష్యూలో రేవంత్ రెడ్డే వెనుకుండి నడపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయని, కానీ ఆయన ఎవరి వెనుక ఉండరని, ముందుండే పార్టీని, కార్యకర్తలను నడిపిస్తారని ప్రశంసించారు. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగిందని కేసును సీబీఐకి అప్పగిస్తే కేంద్రం ఆ దిశగా సముఖత చూపడం లేదని అన్నారు.

కవితను బీసీలు నమ్మరు - Tholi Paluku